ఎట్టకేలకు కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రం మరోసారి కాస్త సానుకూలంగా స్పందించిందని చెప్పొచ్చు. సాధ్యాసాధ్యాలపై వీలైనంత వేగంగా నివేదికను ఇవ్వాలంటూ మెకా సంస్థను ప్రభుత్వం కోరింది. నిజానికి, ఇలాంటి నివేదికను గతంలోనూ కేంద్రం కోరింది. తాజా ఆదేశాల్లో వీలైనంత త్వరగా… వచ్చే ఎన్నికల్లోగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సానుకూల ప్రకటన ఉండే అవకాశం ఉందనీ చెబుతున్నారు. కడపలో కేంద్రమే స్వయంగా కర్మాగారం ఏర్పాటు చేస్తుందా, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరో సంస్థతో ఫ్యాక్టరీ పెడతారా అనే అంశాలపై ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ మెకాని అడిగినట్టు సమాచారం. అయితే, ఇందులో బయ్యారం ప్రస్థావన లేదు. ఎందుకంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది కదా!
కడప ఉక్కుపై కేంద్రం మరోసారి స్పందించేలా ఒత్తిడి చేయడంలో టీడీపీ ఎంపీల కృషిని కచ్చితంగా గుర్తించాలి. ఓ పక్క కేంద్రంతో నేరుగా పోరాటం చేస్తూనే… వ్యక్తిగతంగా ఆ శాఖ మంత్రిని కలుస్తూ వినతులు ఇస్తూ వచ్చారు. గతవారంలో కూడా ఎంపీలు ఢిల్లీ వెళ్లి, మంత్రి బీరేంద్ర సింగ్ ను కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే… త్వరలో ఓ సానుకూల ప్రకటన ఖాయం అనే ధీమాను ఏపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే తాజా కేంద్ర స్పందన ఉంది. అయితే, ఇది కూడా కేవలం నివేదికల్ని తెప్పించుకోవడంపైనే ఉండటం గమనించాలి. దీని ద్వారా ఒకటైతే స్పష్టమౌతోంది… కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు… ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తరువాతైనా జరిగేందుకు ఆస్కారం ఉందనేది..! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత బయ్యారంపై కూడా ఇలాంటి ప్రకటనే కేంద్రం చేసే అవకాశం ఉందంటున్నారు.
నిజానికి, కేంద్రం ఉక్కు పరిశ్రమపై స్పష్టత ఇవ్వకపోయినా… తామే సొంతంగా ఫ్యాక్టరీ నిర్మించేసుకుంటామని ఇప్పటికే తెలంగాణ సర్కారుకు ప్రకటించింది. ఈ మధ్య ఏపీ కూడా ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలనే కేంద్రం ముందు ఉంచింది. కేంద్రమే నిర్మిస్తుందా… లేదంటే, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రమే పరిశ్రమ నిర్మించుకునే విధంగా మార్గదర్శకాలు జారీ చేసి, పన్ను రాయితీలు, ఇతర అనుమతులు ఇస్తారా అనేది తేల్చాలంటూ తాజాగా ఏపీ ఎంపీలు కోరారు. మరి, ఈ ఒత్తిడిని కేంద్రం పరిగణనలోకి తీసుకుందా… లేదంటే, ఎంపీలు అదే పనిగా వస్తున్నారు కాబట్టి, ఏదో ఒక పని జరుగుతోందన్నట్టుగా కాలయాపన చేసే మార్గమా ఇది అని అనుమానించేవారూ లేకపోలేదు.