తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు శుభవార్త! కొద్ది సేపటి క్రితం డిల్లీలో ముగిసిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏడాది పాటు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా విధానాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. కనుక దాని కోసం కేంద్ర ప్రభుత్వం నేడు ఒక ఆర్డినెన్స్ ని జారీచేయబోతోంది. వివిధ రాష్ట్రాల అభ్యర్ధనలను, విద్యార్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నీట్ ని ఏడాది పాటు వాయిదా వేయాలని నిశ్చయించుకొన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దీని గురించి చర్చించి ఎంసెట్ పరీక్షా ఫలితాలు శనివారం ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణా మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. ఆర్డినెన్స్ జారీ అవగానే, దానిపై ముఖ్యమంత్రితో చర్చించి వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం తేదీలు ప్రకటిస్తామని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా అందుకు సిద్దం అవుతున్నాయి.