ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేంద్రానికి సమర్పించిన సమగ్ర నివేదిక (డి.పి.ఆర్.)ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఈ నెల 18న డిల్లీలో నిర్మాణ్ భవన్ లో ప్రీ-పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు సమావేశం నిర్వహించబోతోంది. ఆ సమావేశంలో దానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఈ ప్రాజెక్టుని పర్యవేక్షించబోయే అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ కి అందజేస్తుంది. జపాన్ కి చెందిన జైకా సంస్థ ఆర్ధిక సహాయంతో డిల్లీ మెట్రో కార్పోరేషన్ ఈ ప్రాజెక్టుని నిర్మిస్తుంది. ఈ లాంచనాలన్నీ పూర్తవడానికి మరో మూడు నాలుగు నెలల సమయం పట్టవచ్చు కనుక ఈ ఏడాది చివరిలోగా నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోనే పనులు మొదలుపెట్టగలిగితే వచ్చే ఎన్నికల నాటికి మెట్రో రూపురేఖలు కళ్ళకు కనిపిస్తాయి.
మెట్రో ప్రాజెక్టు లాభసాటిగా నడవాలంటే కనీసం 20 లక్షల మంది జనాభా ఉండాలి. కానీ విజయవాడలో అంత జనాబా లేరు కనుక దానికి ఆర్ధిక సహాయం చేయలేమని కేంద్రం చెప్పడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని కేంద్రాన్ని ఒప్పించగలిగారు. కేంద్రం దీనికి ఆర్ధిక సహాయం చేయకపోయినా అనుమతుల విషయంలో మోకాలు అడ్డకుండా చేయగలిగారు. ప్రస్తుతం విజయవాడలో జనాభా తక్కువే ఉన్నప్పటికీ అమరావతి నిర్మాణం మొదలయితే చాలా వేగంగా జనాబా పెరిగే అవకాశం ఉందనే దూరదృష్టితో ఆలోచించి చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళుతున్నారు. ఇంకా విశాఖ మెట్రో ప్రాజెక్టుకి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు. తిరుపతిలో కూడా మెట్రో ఏర్పాటు చేద్దామని అనుకొన్నప్పటికీ అది ఏమాత్రం లాభదాయకం కాదని ఈ ప్రాజెక్టుల సలహాదారు ఈ.శ్రీధరన్ చెప్పడంతో ముఖ్యమంత్రి ఆ ఆలోచన విరమించుకొన్నట్లు తెలుస్తోంది.