హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ఉద్యోగులను అమరావతి తరలిరావడానికి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలలో ‘స్థానికత’ కూడా ఒకటి. తామందరం చాల ఏళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడినందున తమ పిల్లలకు తెలంగాణాలో ‘స్థానికత’ కలిగిఉన్నారని, ఒకవేళ అమరావతికి తరలివస్తే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వచ్చే ఏడాది జూన్ 30లోగా రాష్ట్రానికి తరలివచ్చిన వారందరికీ స్థానికత కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందుకు వీలుకల్పించే విధంగా పార్లమెంటులో ఆర్టికల్ 371కి సవరణ చేయవలసిందిగా కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా వ్రాసింది.
కానీ అందుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం. ఇది విద్యా, ఉద్యోగ అవకాశాలతో ముడిపడున్న సంక్లిష్టమయిన అంశం కనుక దీనిపై తొందరపాటుతో నిర్ణయం తీసుకోవడం తగదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణా రావుకి ఒక లేఖ వ్రాశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వివరణ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అభ్యర్ధనను మన్నించి ఆర్టికల్ 371కి సవరణ చేసినట్లయితే, ఇతర రాష్ట్రాల నుండి కూడా అటువంటి డిమాండ్స్ రావచ్చని కేంద్రప్రభుత్వం భయపడుతున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివచ్చే ఆంధ్రా ఉద్యోగుల పిల్లలకు ఒకవేళ ‘స్థానిక హోదా’ కల్పించడం సాధ్యం కానట్లయితే, ఉద్యోగులు కూడా అమరావతికి తరలివచ్చేందుకు వెనకాడవచ్చును. అప్పుడు అమరావతి నుండి రాష్ట్ర పరిపాలన సాగించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన ఆచరణలో పెట్టడం కూడా కష్టం కావచ్చును. ముందు ఇటువంటి సమస్యలు పరిష్కరించుకొన్న తరువాతనే (రూ.180 కోట్లతో) తాత్కాలిక సచివాలయ నిర్మాణం వంటి ఆలోచనలు చేస్తే మంచిదేమో?