ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరవుకు కేంద్రం షాకిచ్చిందని.. కొన్ని మీడియా చానళ్లు హడావుడి చేశాయి. కాసేపటికి సైలెంటయ్యాయి. నిజానికి ఇలాంటి షాకులు.. ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండే తింటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన షాకేం లేదు. అందుకే వెంటనే తేరుకుని.. బ్రేకింగ్‌లు .. ఆపేశాయి. ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ పై క్యాట్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన క్యాట్ తీర్పు రిజర్వ్ చేసింది. తాము కేంద్రానికి చెప్పామని.. ఏపీ తరపు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న ఆరోపణలతో పాటు.. సస్పెన్షన్ ఫలానా కారణాల వల్ల విధిస్తున్నామని చెబుతూ.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది.
రాష్ట్రం రాసిన లేఖను సంబంధిత విభాగం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ధ్రువీకరిస్తున్నామని హోంశాఖ వెల్లడించింది. ఇది నిబంధనల ప్రకారం రొటీన్ ప్రక్రియ. అయితే.. మీడియా చానళ్లు మాత్రం.. ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని కేంద్రం కూడా నిర్ధారించిందంటూ… హడావుడి చేసేశాయి. ఇందులో కేంద్రం ఎక్కడా ఆ విషయాలను ప్రస్తావించలేదు. కేవలం రాష్ట్రం ఆయా ఆరోణలు చేస్తూ సస్పెన్షన్ వేటు వేసిందని చెబుతూ… ఏప్రిల్ 7లోగా అభియోగపత్రం దాఖలు చేయాలని రాష్ట్రానికి సూచించింది.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చేయడానికి చాలా తీవ్రమైన కారణాలను ప్రభుత్వం చెప్పింది. వాటిపై ఇప్పుడు ఆధారాలతో సహా చార్జిషీట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఏబీ వెంకటేశ్వరావు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చార్జిషీటు దాఖలు చేయకపోతే… కక్షపూరితంగా తీసుకున్న చర్యలుగా పరిగణించే పరిస్థితులు ఏర్పడతాయి.