కశ్మీర్లో ఏదో జరుగుతోంది..? … ఇది కొద్ది రోజులుగా.. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో.. సాధారణ ప్రజల్లో వస్తున్న అనుమానం. ప్రజల ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కావడానికి.. కేంద్రం కూడా.. శతవిధాలా ప్రయత్నం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. కశ్మీర్ విషయంలో… ఊహించని నిర్ణయాలు తీసుకుంది. పది వేల మంది అదనపు బలగాలను ఇప్పటికే తరలించింది. మరో ఇరవై ఎనిమిది వేల మందిని తరలించడానికి షెడ్యూల్ ఖరారు చేసింది. అంతకు మించి.. భర్తులు అత్యంత పవిత్రంగా భావించే.. అమర్నాథ్ యాత్రను కూడా మధ్యలోనే ముగించారు. అందర్నీ ఉన్న పళంగా వెనక్కి పంపేస్తున్నారు. యాత్రికుల్ని మాత్రమే కాదు.. కశ్మీర్ ఎన్ఐటీలో ఉన్న విద్యార్థుల్ని కూడా.. హుటాహుటిన స్వస్థలాలకు పంపేస్తున్నారు. దీంతో.. కశ్మీర్ విషయంలో కేంద్రం అతి పెద్ద ముందడుగు వేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న వివాదాస్పద ఆర్టికల్ 35-ఏను రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆర్టికల్ 35-ఏను కొనసాగించాల్సిందేనని కశ్మీర్‌లోని రెండు ప్రధాన పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టికల్ 35-ఏ కశ్మీర్ ప్రజల హక్కు అని, దాన్ని తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ లేకుంటే భారత్‌తో జమ్ముకశ్మీర్‌కు సంబంధం ఏమిటనేది ఆయా పార్టీల వాదన. మరో వైపు బీజేపీ మాత్రం ఆర్టికల్ 35-ఏను తొలగించాలన్నదే తమ విధానమంటోంది. కశ్మీర్ అభివృద్ధికి ఈ ఆర్టికల్ అడ్డంకిగా మారిందని బీజేపీ చెబుతోంది.
1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ఆర్టికల్ 35-ఏను భారత రాజ్యాంగంలో చేర్చారు. దీని ద్వారా జమ్ముకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు సంక్రమించాయి. బయటి వ్యక్తుల రాకను ఈ ఆర్టికల్ అరికడుతుంది. ఇతర రాష్ర్టాల పౌరులు కశ్మీర్లో ఆస్తులు కొనరాదు. స్థిర నివాసం ఏర్పరుచుకోకూడదు. పరిశ్రమలు, సంస్థలు స్థాపించకూడదు. ప్రస్తుతం కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉంది. కేంద్రం 35 ఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోబోతోందా.. లేక.. అంతకు మించి ముందడుగు ఏదైనా వేయబోతోందా..అన్నది.. ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. కశ్మీర్లో ఏం జరుగుతుందో చెప్పాలంటే.. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్లో ప్రకటనచేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏం జరిగినా… కశ్మీర్లో మాత్రం… ఓ భారీ ఇన్సిడెంట్ ఖాయమని మాత్రం అంచనా వేస్తున్నారు.