పెద్ద నోట్ల రద్దు నిర్ణయం… భాజపా సర్కారు గొప్పగా చెప్పుకోవచ్చు, మోడీ భక్తులు అద్భుతః అని కీర్తించుకోవచ్చు! సామాన్య ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసిన నిర్ణయం ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది నల్లధనంపై పోరాటం అని ఘనంగా ప్రకటించీ, యాభై రోజుల తరువాత అద్భుతాలు జరిగిపోతాయని చెప్పారు. అద్భుతాలు జరగవని స్పష్టమైపోయింది. కనీసం దేశంలో సాధారణ ఆర్థిక స్థితి ఎప్పుడొస్తుందన్న క్లారిటీ కేంద్రం దగ్గర ఇప్పటికీ లేదు. ఒకవేళ ఉంటే వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ వంటివారు ఈపాటికే ఆగేవారు కాదు. మైకావేశంతో మాట్లాడేసేవారు. ప్రస్తుతం కేంద్రం దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్… ప్రజలను సంతృప్తిపరచడం!
పెద్ద నోట్ల రద్దు తరువాత భాజపా సర్కారుపై ప్రజల్లో ఆగ్రహం రగిలింది. ప్రజలు ఉద్యమించలేదు కాబట్టి.. మోడీ నిర్ణయం సర్వదా ఆమోదయోగ్యం అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కోసారి ప్రజల ఆగ్రహం బయటపడాలంటే ఎన్నికల వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సంగతి మోడీ సర్కారుకి తెలియంది కాదు. అందుకే, ఇప్పుడు జనాకర్షక నిర్ణయాలవైపు మళ్లుతున్నట్టు సమాచారం. త్వరలోనే దేశవ్యాప్తంగా పేద నిరుద్యోగులకు భృతి ఇచ్చే పథకానికి రూపకల్పన జరుగుతున్నట్టు సమాచారం. ప్రతీ పేద నిరుద్యోగికీ ఏడాదికి రూ. 5 వేలు ఇవ్వాలని అనుకుంటున్నారట! అవును… అక్షరాలా ఏడాది ఐదు వేల రూపాయలు మాత్రమే!! బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని హస్తిన వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే… కేవలం పేద ప్రజలను సంతృప్తి పరచడం కోసమే ఇలాంటి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా స్పష్టమౌతుంది. ఏడాదికి రూ. 5 వేలు ఇస్తే… ఏ నిరుద్యోగి అయినా ఏం చేసుకోవాలి? ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో, ద్రవ్యోల్బణ స్థితిగతుల్లో, పెరుగుతూ పోతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో… కేంద్రం విదిల్చే ఐదు వేలూ దేనికి సరిపోతాయి. సరే, కేంద్రం పాయింటాఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే… దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వడం అంటే ఎన్ని వందల కోట్లు అదనపు భారం కేంద్రంపై పడుతుంది..? ఆ భారాన్ని ఎలా భర్తీ చేస్తారు..? మళ్లీ ట్యాక్స్‌లు పెంచుతారా..? మళ్లీ సామాన్య మధ్య తరగతి ప్రజలపై భారమా..? ఈ పథకం అమలు ద్వారా ఏం సాధిస్తారు..? కేవలం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా ఇది కనిపిస్తోంది. అంతకుమించిన లబ్ధి దీని ద్వారా ఉంటుందా..?