మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం వల్ల పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రావని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కారణం చెప్పి.. ఎస్ఈసీ, టీడీపీని కలగలపి.. కుట్ర చేశారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు తక్షణం నిర్వహించాలంటూ.. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ప్రభుత్వం ఎందుకు మర్చిపోయిందోనని అందరూ అనుకుంటున్న సమయంలో… ఆ నిధులను కేంద్రం విడుదల చేసినట్లుగా సమాచారం బయటకు వచ్చింది. ఫధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మూడు రాష్ట్రాలకు పట్టణ స్థానిక సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1600 కోట్లుకుపైగా విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రూ. 431 కోట్లు ఉన్నాయి. వీటిని రాష్ట్ర ఖాతాలో జమ చేసినట్లుగా.. కేంద్రం.. సమాచారం పంపింది.
నిజానికి మున్సిపల్ ఎన్నికలు ఏపీలో జరగలేదు. వాయిదా పడ్డాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ..దీన్నేమి పట్టించుకోకుండా.. కేంద్రం నిధులు విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే.. స్థానిక ఎన్నికలకు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధం లేదన్న విషయం అర్థమవుతుందని రాజకీయ పార్టీలు అంటున్నాయి. వైసీపీ నేతలు వాలనే.. ఆ రెండింటికి ముడిపెట్టి విమర్శలు చేశారని అంటున్నారు. ఇప్పుడు కేంద్రం నిధులు విడుదల చేయడం వల్ల వారి వాదనలో పసలేదని తేలిపోయిందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రూ. 431 కోట్ల ఆర్థిక సంఘం నిధులను పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. ఆర్బీఐ వడ్డీ వసూలు చేస్తుంది.
ఇప్పుడు మున్సిపల్ కోటాకు సంబంధించిన నిధులను విడుదల చేశారు.. త్వరలో మండల, పంచాయతీలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉందని.. అధికారవర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఏపీకి పధ్నాలుగో ఆర్థిక సంఘం ద్వారా.. రూ. 3,500 కోట్ల నిధులు స్థానిక సంస్థలకు వస్తాయన్న అంచనా ఉంది. ఎన్నికలు జరగకపోతే ఇవి రావని.. వాదించారు. కానీ.. ఆ వాదన తప్పని.. తాజాగా నిధుల విడుదల తేలిపోయింది. ఇప్పుడు ఇక వైసీపీ నేతలు సైలెంట్ అయిపోతారేమో..?