పోలవరం ప్రాజెక్ట్‌కు.. రూ. ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టామని.. ఆ నిధులను రీ ఎంబర్స్ చేయాలని.. దాదాపుగా ఏడాదిగా అడుగుతున్న ఏపీ సర్కార్‌కు కేంద్రం… కేవలం రూ. 1850 కోట్లు మాత్రమే విడుదల చేసేందుకు అంగీకరించింది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి చట్టం ప్రకారం.. వంద శాతం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలి. అయితే.. ముందుగా ఏపీ సర్కార్ ఖర్చు పెట్టాలి. వాటిని కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఈ ప్రకారం.. గత ప్రభుత్వం శరవేగంగా చేపట్టిన పనుల వల్ల.. రూ. ఐదు వేలకోట్ల వరకూ నిధులు రావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వం ఆ నిధుల కోసం.. కేంద్రాన్ని అడుగుతూ ఉంది.
జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా… ఇచ్చే వినతి పత్రాల్లో పోలవరం నిధుల ప్రస్తావన కూడా ఉంటుంది. ఇటీవల ప్రధాని మోడీ… హోంమంత్రి అమిత్ షాలను కలిసినప్పుడు.. పోలవరం కోసం.. ఏపీ సర్కార్ ఖర్చు పెట్టిన రూ. ఐదు వేల కోట్లతో పాటు.. ఈ ఏడాది సహాయ, పునరావాసానికి రూ. పదహారుల వేల కోట్లు ఇవ్వాలని కోరారు. అయితే… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ.. నుంచి.. వచ్చిన వివరాల ప్రకారం… రూ.3 వేల కోట్లకు మాత్రమే కేంద్ర జలశక్తి శాఖ ఆర్థిక శాఖకు ఫైల్ పంపింది. చివరికి ఆర్థిక శాఖ.. అందులోనూ కేవలం రూ.1850కోట్లకు మాత్రమే అంగీకారం తెలిపింది.
ప్రభుత్వం నుంచి ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకున్న తర్వాత మిగిలిన నిధులు విడుదల చేస్తామని చెబుతోంది. ఇక సహాయ పునరావాస కార్యక్రమాలకు మాత్రం.. నిధుల ఊసు లేదు. అసలు.. ఆ పనులతో తమకు సంబంధం లేదని కేంద్రం వాదిస్తోంది. పైగా ఇప్పుడు ఏపీ సర్కార్ తీవ్రమైన నిధుల కటకటలో ఉంది. పాత కాంట్రాక్టర్ ను తొలగించి.. కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది. సెటిల్ చేయాల్సిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అయినా కేంద్రం కేవలం రూ. 1850 కోట్లు మాత్రమే విడుదల చేసింది.