ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని… త్వరలో సమీక్షించి.. ఏం చేయాలో నిర్ణయిస్తుందని… కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఢిల్లీలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు నిర్ణయంపై.. కేంద్ర జలశక్తి మంత్రి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతి రోజునే… సుజనా చౌదరి మీడియా సమావేశం పెట్టి.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనులన్నింటినీ రద్దు చేసుకుంటూ పోతే.. రాష్ట్రంవైపు ఏ పారిశ్రామికవేత్త కూడా రాడని.. సుజనా చౌదరి అంటున్నారు., ఉన్న వాళ్లే వాళ్లిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుకుంటున్న నిర్ణయాలన్ని వ్యక్తిగత ద్వేషంతోనే తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు…వ్యక్తిగత దూషణలతోనే ముగిసిపోయాయని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. కేంద్రం చాలా సీరియస్గా ఉందని.. సుజనా చౌదరి తన మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్ట్ పరిణామాలన్నింటిపై.. అధ్యయనం చేస్తామని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వ పరంగా.. ఎలాంటి ఆటంకం లేదని.. కావాల్సినన్ని నిధులు.. అందుబాటులో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం చేతిలోనే ఉంటే.. నిర్మాణం వేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతో… రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చారని… గుర్తు చేశారు. ప్రతీది రద్దు చేసుకుంటూ పోతే… ఏపీకి నష్టం జరుపుతుందన్నారు. ఓ సారి కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారినా… పనులు ఆపి.. వేరే వారికి కాంట్రాక్టులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బ్యాంకులు కూడా ఏపీకి రుణాలివ్వవని ఆవేదన వ్యక్తం చేశారు.
సుజనా చౌదరికి.. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీకి సంబంధించిన.. వ్యవహారాలు ఆయనకే కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ తరపున.. కేంద్రంలో మంత్రిగా ఆయనకే అవకాశం దక్కబోతోందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరి.. ఇలా ఢిల్లీలో ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి.. ఏపీలో పరిస్థితులపై కేంద్రం అధ్యయనం చేస్తుందని… ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం.. రాజకీయవర్గాల్లో కాస్త సంచలనాత్మకమైన విషయంగానే మారింది.