సోమ మంగళ వారాలలో హైదరాబాద్ యూనివర్సిటీలో ఏర్పడిన ఉద్రిక్తతకు కేంద్రం పూర్తి బాధ్యత వహించక తప్పదు. రోహిత్ వేముల ఆత్మహత్యతో అగ్నిగుండమైన హెచ్‌సియులో విద్యార్థుల ఆందోళన ఏ దశలోనూ ఉద్రిక్తతలు సృష్టించలేదు. అనేక మంది జాతీయ నాయకులు సంఘీభావం తెలిపి వెళ్లారే గాని ఉద్యమం అదుపు తప్పలేదు. అయితే హెచ్‌సియులో కుల వివక్ష సమస్య ముందుకు వచ్చింది గనక రోహిత్ దళితుడు కాదనే వాదనతో ప్రధానంగా ప్రభుత్వమూ బిజెపి ఎదురు దాడి చేశాయి. అదేమంతగా ఫలితాలు ఇవ్వకపోవడంతో అనివార్యంగా విసి అప్పారావును సెలవుపై పంపించి ఈ లోగా జెఎన్‌యులో జాతీయత చిచ్చురగిలించారు.
సామాజిక న్యాయం సమస్యపై చిక్కులో పడ్డారు గనక జెఎన్‌యులో ఏకంగా దేశద్రోహం ఆరోపణలుచేశారు. హెచ్‌సియులోనూ ఆ విధమైన ఆరోపణలు బెడిసికొట్టినా పాఠం నేర్చుకోకపోగా పార్లమెంటు వరకూ అవే మాటలు వినిపించారు. ఇవన్నీ అయ్యాక కూడా జెఎన్‌యు అధికార దర్యాప్తు నివేదికలలో కన్నయ్య కుమార్ గాని, లోపలి విద్యార్థులు గాని దేశవ్యతిరేక నినాదాలు ఇవ్వలేదని స్పష్టమైపోయింది. బయిటివారే ఆ పనిచేశారని చెబుతూనే వారిని ఎవరు అనుమతించాలో తెలుసుకోవాలని నివేదికలు చెప్పాయి.
అరెస్టయిన విద్యార్థి నేతలకూ ఇతరులకూ కూడా కోర్టులలో బెయిలు లభించి వారు సభలూ సమావేశాలు జరుపుకోవడం మొదలుపెట్టారు. అంతకు ముందరి ప్రచారాలు వెనక్కుపోక తప్పలేదు. ఈ సందర్భంగా తమకు అఫ్జల్ గురు ఆదర్శం కాదని రోహిత్ తన ఆదర్శమని కన్నయ్య మొదటి ప్రసంగంలోనే ప్రకటించారు. రాజకీయ పరిపక్వత వుంటే అంతటితో ఆ వివాదం ముగించి ప్రశాంత పరిస్థితిని పునరుద్ధరించేందుకు కేంద్రం ప్రయత్నించాల్సింది. కాని జరిగింది పూర్తి విరుద్ధం.
హెచ్‌సియు నుంచి జెఎన్‌యుకు వెళ్లిన వారు మళ్లీ ఇప్పుడు ఇక్కడ చిచ్చు పెట్టేందుకు సిద్ధమైనారు. వైస్ చాన్సిలర్ అప్పారావును లోపాయికారిగా తిరిగి విధుల్లో చేర్చుకోవడం, ఆయన తనకు అనుకూలులైన విద్యార్థి, అధ్యాపకులతో మంతనాలు జరపడం మరోసారి ఉద్రిక్తతకు కారణమైంది. నిరసన తెల్పిన వారిపై తెలంగాణ ప్రభుత్వం పోలీసులను పురికొల్పితే విచక్షణా రహితంగా లాఠీచార్జిలు చేశారు. మెస్‌లు మూసేసి తిండి లేకుండా చేశారు. మీరు చాలా బాగా చేశారని బిజెపి నేత ఒకరు ట్విట్లర్లో టి ప్రభుత్వాన్ని అభినందించారు.
బుధవారం కన్నయ్య కుమార్‌ను వచ్చి రోహిత్‌కు నివాళులర్పిస్తే అభ్యంతరం ఏమిటి? అడ్డుకోవడమెందుకు? ఆపైన ఇంత తీవ్రంగా పోలీసు బలప్రయోగాలెందుకు? ఒక యువ విద్యార్థిపై దేశద్రోహం ఆరోపణ వేసి, నిజంగా ఆరోపణలుఎదుర్కొంటున్న అప్పారావుకు అండగా నిలవాల్సిన అవసరం వుందా? ఆయన తప్ప హెచ్‌సియును మరెవ్వరూ నడపలేరా? కనుక ఇదంతా కావాలని చేస్తున్న రాజకీయమని తేలిపోయింది.