మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జి.ఎస్.టి.బిల్లుపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాజ్యసభలో దానికి అడ్డుపడుతుండటంతో, కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఆ బిల్లుని పార్లమెంటు చేత ఆమోదింపజేసుకోలేకపోయింది. చివరికి వాటి ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆ బిల్లులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసింది.
అవేమిటంటే 1. వస్తువులపై ఉత్పత్తి చేసే సంస్థల నుంచి అధనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేయాలని బిల్లులో చేసిన ప్రతిపాదనని తొలగించింది. 2 ఈ నూతన పన్ను విధానం అమలులోకి వచ్చినప్పుడు, దాని వలన ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక కేంద్రప్రభుత్వం ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది. మొదటి మూడేళ్ళు 100 శాతం, తరువాత రెండు సం.లలో మొదట 75 శాతం, ఆ తరువాత 50 శాతం నష్టాన్ని కేంద్రమే భర్తీ చేస్తుంది.
ఇటీవల జరిగిన రాష్ట్రాల ఆర్దిక మంత్రులు సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించినపుడు, చాలా మంది సానుకూలంగానే స్పందించారు. కానీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోరుతున్న ప్రకారం అయితే ఆ బిల్లులో ఇంకా మరికొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది.
అవేమి కోరుతున్నాయంటే, ఈ నూతన విధానం వలన రాష్ట్రాలకి కలిగే నష్టాన్ని కేంద్రప్రభుత్వం ఐదేళ్ళపాటు 100 శాతం భర్తీ చేయాలి. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ కూడా అదే సూచించింది. బిల్లులో పేర్కొన్న పన్ను శాతం ఇంకా తగ్గించాలి. దానిని నిర్దిష్టంగా ఆ బిల్లులోనే పేర్కొనాలి. ఈ నూతన పన్ను విధానం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో ఒక అధికారిక వివాదాల పరిష్కార వ్యవస్థని ఏర్పాటు చేయాలి.
వాటి మూడు డిమాండ్లలో మొదటిదానికి పూర్తిగా అంగీకరించి అదనపు ఒక్క శాతం పన్ను తొలగించింది కానీ మిగిలిన రెంటి కోసం కేంద్రప్రభుత్వం వేరే పరిష్కరాలు సూచించింది. ఐదేళ్ళ పాటు 100 శాతం నష్టాన్ని భర్తీకి బదులు మూడు దశలలో భర్తీ చేయడానికి అంగీకరించింది. వివాదాల పరిష్కారం కోసం జి.ఎస్.టి. కౌన్సిల్ ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.
ఈ మార్పులకి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సంతృప్తి చెంది బిల్లు ఆమోదానికి సహకరించినట్లయితే, త్వరలోనే రాజ్యసభ చేత మళ్ళీ మరోమారు లోక్ సభలో దానికి ఆమోదముద్ర వేయించుకొని 2017 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్ధిక సం.నుంచి దీనిని అమలులోకి తీసుకువస్తుంది.