మార్చి 22వ తారీఖున ప్రధాని ప్రకటించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీన ముగియనుంది. ఏప్రిల్15వ తేదీన లాక్ డౌన్ ఎత్తి వేస్తారా లేక తిరిగి కొనసాగిస్తారా అన్న ప్రశ్న ప్రజల మనసుల్లో తొలుస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ కరోనా ను కట్టడి చేస్తుంది అని ప్రజలు భావించారు. అయితే రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడం, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే అమెరికా తదితర దేశాల వలె భారత్ పరిస్థితి మారుతుందని నిపుణులు హెచ్చరించడం కారణంగా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న కెసిఆర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కొనసాగించడం మినహా వేరే గత్యంతరం లేదని, లాక్ డౌన్ కొనసాగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా సూచనలు చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సి ఉందని ప్రకటించారు. మరొక పక్క ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా దీన్ని కొనసాగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇదే తరహా విజ్ఞప్తి చేశారు.
వీరే కాకుండా మరికొందరు ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సినదిగా ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. తమిళనాడులో అనూహ్యంగా 500కు పైగా కేసులు నమోదు కావడం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతుండడం కారణంగా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లాక్ డౌన్ కొనసాగించమని కోరే అవకాశం ఉంది.
మొత్తం మీద చూస్తే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ కొనసాగించడమే మేలు అనే అభిప్రాయం అటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, నిపుణులు, శాస్త్రవేత్తలలో కూడా కనిపిస్తోంది. వీటన్నింటిని బట్టి చూస్తే పేద ప్రజలకు ఇబ్బంది అయినా సరే, గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారం లోపే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.