ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు-ప్రకాశం జిల్లాల మధ్య 6000మెగా వాట్స్ సామర్ధ్యం గల ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కానీ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంటుంది. మొదట ఈ ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మిడ్నాపూర్ వద్ద ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం భావించింది. కానీ అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా అందరూ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిని వేరే చోట నెలకొల్పేందుకు కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా సర్వే చేయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం-నెల్లూరు జిల్లాల మధ్య దానికి చాలా అనువుగా ఉన్నట్లు గుర్తించింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజలు అంగీకరిస్తే ఈ భారీ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేయడానికి కేంద్రం సిద్దంగా ఉంది. ప్రస్తుతం దీని గురించి సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళంలో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ దానికి స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురవడంతో అది ఏర్పాటు అవలేదు. ఈసారి నెల్లూరు-ప్రకాశం జిల్లాల మధ్య ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు అంగీకరిస్తాయో లేదో చూడాలి.