టీకా విధానంపై రాష్ట్రాలన్నీ దండెత్తుతూండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనక్కి తగ్గారు. రాష్ట్రాలకు టీకాలన్నీ ఉచితంగానే పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. అయితే ప్రైవేటు రంగంలో .. డబ్బు ఖర్చు పెట్టుకుని టీకా వేయించుకునేవారికి అవకాశం కల్పిస్తామన్నారు. దేశంలో టీకాలు ఉత్పత్తి చేస్తున్న సంస్థల వద్ద నుంచి ఉత్పత్తయిన టీకాల్లో 75శాతం కేంద్రమే కొనుగోలు చేస్తుందని..మిగతా ఇరవై ఐదు శాతాన్ని ప్రైవేటు రంగానికి కేటాయిస్తారని ప్రకటించారు.
ఈ 75శాతం టీకాల్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తామన్నారు. ఇరవై ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని మోడీ ప్రకటించారు. ఉచిత టీకా పంపణీ విధి విధానాలను.. మెకానిజంను రెండు వారాల్లో ఖరారు చేసి.. ఆ తర్వాత ప్రారంభించేందుకు 21వ తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు. టీకాల అంశంపై.. దేశంలో విస్తృతమైన చర్చ జరుగుతూండటం… సుప్రీంకోర్టు కూడా.. వివరాలను అడగడంతో.. కేంద్రం టీకా విధానాన్ని సమీక్షించుకున్నట్లుగా కనిపిస్తోంది. సాయంత్రం ఐదు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ… మొదట.. ఇండియా కరోనా కష్టాలను ఏకరవు పెట్టి.. కేంద్రం ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను వివరించిన తర్వాత .. టీకాలను ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ఏడాది చివరి కల్లా 90శాతం మందికి టీకాలు వేస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో తయారీ ఊపందుకుందని.. విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటున్నామని మోడీ తెలిపారు. త్వరలో రెండు కొత్త వ్యాక్సిన్లు రాబోతున్నాయని.. నాసల్ వ్యాక్సిన్లపై కూడా పరిశోధన జరుగుతోందన్నారు.
మోడీ టీకా విధానాన్ని మార్చడంతో.. రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు రావు.. కొనడానికి గ్లోబల్ టెండర్లు పిలిచినా స్పందన ఉండటం లేదు. ఈ కారణంగా రాష్ట్రాలు తీవ్ర ఒత్తిడిలోఉన్నాయి. కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీయేతర ముఖ్యమంత్రులుఅదే పనిగా లేఖలు రాసుకుంటున్నారు. ప్రజల్లో కూడా వ్యాక్సిన్ అందక అసహనం పెరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపధ్యంలో.. ఉచిత వ్యాక్సిన్ విధానానికి కేంద్రం.. నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.