ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ.. ఎన్నికల హడావుడి ప్రారంభమైన సమయంలో.. తమ రాష్ట్రం మీద దృష్టి పెట్టకుండా..నేరుగా ఢిల్లీకి గురి పెట్టారు. కూటముల పేరుతో హడావుడి చేస్తున్నారు. ప్రత్యేక విమానాలేసుకుని… పరుగులు పెడుతున్నారు. ఉత్తరాది నేతలతో భేటీల మీద భేటీలు జరిపి… ఇక దేశ రాజకీయాన్ని మార్చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా ఈ ఇద్దరు నేతలకూ ఆ స్టామినా ఉందా..?
గతం గొప్పే.. కానీ ప్రస్తుతం ఏమిటో తెలుసుకోవాలిగా..?
నరేంద్రమోడీని ఓడించి తీరాల్సిందేనన్న పట్టుదలతో చంద్రబాబునాయు జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందర్నీ ఏకం చేయబోతున్నానని హడావుడి చేస్తున్నారు. తన గత చరిత్ర ఎంతో ఘనంగా ఉందని… యునైటెడ్ ఫ్రంట్, వాజ్ పేయి హయాంలో.. దేశ రాజకీయాల్లో తన పాత్రను గుర్తు చేసుకుని.. మళ్లీ అలాంటి పాత్ర పోషిస్తానంటూ హడావుడి చేస్తున్నారు. వరుసగా అందర్నీ కలిసి వస్తున్నారు. కానీ గతంలో.. సెంచరీలు కొట్టామని.. రిటైర్మెంట్కు దగ్గరకు వచ్చిన ప్లేయర్ అప్పట్లాగే ఆడతామని అనుకోవడం పొరపాటే కదా. ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్‌కు తగ్గట్లుగా ఆటను మార్చుకుని వీలైనంతగా టీమ్‌లో కొనసాగేందుకు ప్రయత్నించారు. కానీ ఏం జరుగుతోంది..? జాతీయ నాయకుల్ని కలిసినంత వరకే మీడియా హడావుడి. అదీ కూడా జాతీయ మీడియా అంతంతమాత్రంగానే పట్టించుకుంటోంది. కానీ లోకల్ మీడియా మాత్రమే హైప్ చేస్తోంది. దీని కోసమే… పర్యటనలు ఎందుకో.. ఎవరికీ అర్థం కావడం లేదు.
రెండో సారి గెలిస్తేనే ఇంత హడావుడి ఎందుకో..?
తెలంగాణలో కేసీఆర్ రెండో సారి మాత్రమే గెలిచారు. భారీ విజయమే దక్కి ఉండవచ్చు. అంత మాత్రమే.. దేశం మొత్తం తన వెనుకాలే ఉందన్న భావనలోకి వెళ్లడం హాస్యాస్పదం. దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని.. ఆ పార్టీ నేతలు మొహర్బానీకి చెప్పుకోవడమే ఎబ్బెట్టుగా ఉంటుంది. అయినప్పటికీ.. కేసీఆర్ .. తన కోసం… దేశ నాయకులంతా ఎదురు చూస్తున్నారన్నట్లుగా.. తన నాయకత్వంలో నడిచేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ రెడీగా ప్రకటనలు చేసి పర్యటనలు ప్రారంభించారు. తీరా ఒడిషా, కోల్ కతాలో అక్కడి నేతలు రిసీవ్ చేసుకున్న విధానం చూసి.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి వచ్చారు కాబట్టి… రిసీవ్ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నట్లు ఉంది.. రాజకీయాలను మార్చేందుకు కేసీఆర్‌తో పని చేసేందుకు ఆసక్తి చూపినట్లుగా వారి తీరు లేదు. నిజానికి.. కేసీఆర్ ఇప్పుడు రెండోసారి గెలిచారు. పట్నాయక్ నాలుగు సార్లు గెలిచేశారు. ఐదో సారి లైన్లో ఉన్నారు. మమతా బెనర్జీ అంత కన్నా తిరుగులేని స్థానంలో ఉన్నారు. వారు కేసీఆర్ వెనుక ఎలా నడుస్తారు..?
తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలిద్దరి బలం ఎంత..?
ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. విభజన తర్వాత 17 తెలంగాణకు… 25 ఆంధ్రప్రదేశ్‌కు పోయాయి. రెండురాష్ట్రాలకు ఇద్దరు నేతలు వచ్చారు. రెండు పార్టీలు వచ్చాయి. మహా అయితే.. రెండు పార్టీలు … చెరో పదిహేను స్థానాలు అటూ ఇటుగా వస్తాయనుకుందాం…! అంత మాత్రానికే ప్రధానుల్ని నిర్ణయించేస్తారా..? ఢిల్లీని శాసించేస్తారా..? మరి మిగతా పెద్ద రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో సీట్లు తెచ్చుకునేవారు ఏమనుకోవాలి..? యూపీలో 80 సీట్లు ఉన్నాయి. బెంగాల్ లో 42 సీట్లు , తమిళనాడులో 42 సీట్లు ఉన్నాయి, బీహార్ లో 40 సీట్లు ఉన్నాయి. అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలేమనుకోవాలి..? పట్టుమని పాతిక సీట్లు లేని రాష్ట్రాల పార్టీల అధినేతలే ఇంత హడావుడి చేస్తూంటే… వాళ్లు నవ్వుకోరా..?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరి వ్యవహారం నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాది నేతలు వీరిని విచిత్రంగా చూస్తున్నారన్న విశ్లేషణాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. ముందు ఎన్నికల్లో ప్రభావం చూపించేంతటి గెలుపు సాధించిన తర్వాత .. ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టవచ్చు కదా..అని ఆ నేతల నుంచే సెటైర్లు పడుతున్నాయి. మరి తెలుసుకుంటారా..? పోటాపోటీగా … టూర్లు కొనసాగిస్తారా..?
—-సుభాష్