రైతులు ఏం చేసినా సరే… చట్టాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చేసింది. ఆందోళన చేస్తున్న రైతుల్ని బుజ్జగించడానికి.. ఏడు సవరణలు చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. అయితే అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. రైతులు నో చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగలేదు.. తమ తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించారు. ఇకపై కేంద్రంతో చర్చలు ఉండవని తమది పోరుబాటేనని స్పష్టం చేశారు. అదానీ, రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీంతో పరిస్థితి వేడెక్కింది.
ఆందోళన చేస్తున్న రైతుల్ని చల్లబరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదు. చట్టాల్లో ఏడు మార్పులు చేస్తామంటూ.. సవరణ ప్రతిపాదనల్ని కేంద్రం.. రైతుల వద్దకు పంపింది. అయితే.. రైతులు మాత్రం వాటిని మరో మాట లేకుండా తిరస్కరించారు. వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే… తమ ఏకైక డిమాండ్ అని స్పష్టం చేశారు. రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూండటంతో విధంగా చట్టాల్లో మార్పులు చేసి ఆందోళనలు విరమించేలా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందు కోసం రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. ఎన్ని సార్లు చర్చలు జరిపినా.. కేంద్రం.. చట్టాల్లో కొన్ని సవరణలు చేయడానికి మాత్రమే అంగీకరిస్తోంది.
మద్దతు ధరకు చట్టబద్ధత.. వ్యవసాయ మార్కెట్ల కొనసాగింపు, కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతులకు భూమిపై మరింత రక్షణ కల్పించేలా చట్టాలను మారుస్తామని కేంద్రం ప్రతిపాదిస్తోంది. అయితే అసలా చట్టాలే వద్దని… వాటిని వెనక్కి తీసుకోవడమే.. తమ ఏకైక డిమాండ్ అని రైతులు స్పష్టం చేస్తున్నారు. తాము ఏడాదికిపైగా అయినా సరే నిరసనలు చేపడతామని రైతులు చెబుతున్నారు. వాస్తవానికి వ్యవసాయ చట్టం బిల్లు పాసయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అమలు చేయడమే మిగిలింది. ఆ చట్టం పైకి రైతుల కోసం అని చెబుతున్నప్పటికీ.. పూర్తిగా.. కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు రావడం… ప్రభుత్వ మద్దతు ధరపై ఎక్కువగా ఆధారపడే పంటలు పండించే రైతులు.. ఆ చట్టాలను నమ్మకపోవడంతో… రైతుల ఆందోళన రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది. చట్టాలను వెనక్కి తీసుకోవడం అసాధ్యమని కేంద్రం చెబుతోంది. ఆ చట్టాలు రద్దయిన తర్వాతే వెనక్కి వెళ్తామని రైతులు అంటున్నారు. దీంతో ఈ సమస్య పీట ముడిపడి పడింది.