సరిహద్దుల్లో రైతులు రోజుల తలబడి ఆందోళనలు చేస్తున్నారు. తాము ప్రాణాలైనా త్యాగం చేస్తాం కానీ.. ఆ చట్టాలు రద్దు చేసే వరకూ వెనక్కి వెళ్లేది లేదని చెబుతున్నారు. వారు ఢిల్లీలోకి రాకుండా వేస్తున్న కంచెలు.. పాతుతున్న శూలాలు ప్రపంచం మొత్తం చూస్తోంది. దీనిపై అంతర్జాతీయ సెలబ్రిటీలు స్పందిస్తూంటే మాత్రం… కేంద్ర ప్రభుత్వానికి మండిపోతోంది. ఆ స్పందనలు పోస్ట్ చేస్తున్న ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లపై ఆగ్రహంతో రగిలిపోతోంది. అంతర్జాతీయ పాప్ స్టార్ రిహన్నా, బాల సామాజిక ఉద్యమకారణి గ్రెట్ థెన్ బర్గ్ సహా అనేక మంది ఇండియాలో రైతుల ఉద్యమంపై స్పందించారు. షరా మామూలుగా వారిపై “దేశభక్తులు” రివర్స్ ఎటాక్ చేసింది. మా అంతర్గత విషయాల్లో మీ పెత్తనం ఏమిటని .. నిలదీశారు.
ఈ వివాదానికి కారణం అసలు అలాంటి భావాలు ప్రజల్లోకి రావడానికి ట్విట్టరే కారణమని కేంద్రం అనుకుంటోంది. దేశభక్తి టీవీ చానల్లు, పేపర్లు ఎలాగూ అవి వేయవు.. వేయనివ్వవు కానీ సోషల్ మీడియాకుఅలాంటివి లేవు కాబట్టి.. వచ్చేస్తున్నాయని అనుకుంది. వెంటనే… ట్విట్టర్‌కు తనదైన శైలిలో హెచ్చరికలు పంపింది. అయితే అది డైరక్ట్‌గా ఉండదు.. ఇన్ డైరక్ట్‌గానే ఉంటుంది. అందుకే.. రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన సమయంలో హ్యాష్ ట్యాగ్లు తొలగించలేదని చెబుతూ నోటీసులు జారీ చేసింది.సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనపై తప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని ఆ ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని గతంలో కేంద్రం కోరింది.
దీంతో దాదాపు 100 ఖాతాలను నిలిపివేసింది. 150 ట్వీట్లను తొలగించింది. వీటిలో కిసాన్ ఏక్ మోర్చా, బీకేయూ ఖాతాలు కూడా ఉన్నాయి. రెండు రోజుల తర్వాత బ్లాక్ చేసిన అకౌంట్లను,ట్వీట్లను ట్విటర్ పునరుద్ధరించింది. అయితే శాశ్వతంగా మూసేస్తారని అనుకుందో..లేకపోతే… అంతర్జాతీయంగా రైతుల ఉద్యమంపై వస్తున్న ట్వీట్లను ఇండియాలో వైరల్ చేస్తున్నారని అనుకుంటున్నారో కానీ.. ఈ కారణం చెప్పి.. ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏకపక్షంగా ఖాతాలను పునరుద్ధించడాన్ని ప్రశ్నించింది. లేకపోతే నిషేధిస్తామన్నంత ఆవేశం కేంద్రంలో కనిపిస్తోంది. మొత్తానికి అధికార పెద్దల అసహనం… గీత దాటుతోందన్న అభిప్రాయం మాత్రం తాజా పరిణామాలు కల్పించేలా చేస్తోంది.