మిత్రపక్షం అంటే.. అధికార పార్టీని కాపాడేది… అచ్చంగా.. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు అదే పాత్ర పోషిస్తున్నాయన్న విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి. గత వారంలో కర్ణాటక ప్రభుత్వంలో కీలక మంత్రి… శివకుమార్ పై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఎందుకంటే.. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. బీజేపీకి ఒక్క స్థానం అయినా దక్కించుకోవాలంటే.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావాలి. దాని కోసం.. ఆయనపై బీజేపీ తమ మిత్రపక్షమైన.. ఐటీ, ఈడీని ప్రయోగించింది. దానికి ఆయన చలించలేదు. తొడకొట్టి.. చేతనైతే అరెస్ట్ చేయండి.. అని సవాల్ చేశారు. నిజానికి ఈ శివకుమార్ బీజేపీ టార్గెట్ కూడా. ఎందుకంటే.. గుజరాత్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరపున అహ్మద్ పటేల్ ఎన్నికలవడం వెనుక శివకుమార్ పాత్ర ఉంది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ… బెదిరించి.. డబ్బు ఆశ పెట్టి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూంటే.. ఈ శివకుమారే బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేసి… కాంగ్రెస్ పరువు కాపాడారు. అప్పటి నుంచి.. సీబీఐ, ఈటీ, ఐటీ హిట్ లిస్ట్‌లో శివకుమార్ ఉన్నారు.
ఒక్క శివకుమారే కాదు.. కర్ణాటక ఎన్నికల సమయంలో.. బీజేపీకి.. ఐటీ అధికారులు నేరుగా మిత్రపక్షంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేసుకుని వారు చేసిన దాడులు, సోదాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క బీజేపీ నేత ఇంటిపై దాడి జరగలేదు కానీ… ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సిద్ధరామయ్య బస చేసిన హోటల్ దగ్గర్నుంచి అన్నింటిపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇక తమిళనాడులోనూ.. బీజేపీ ఐటీ, ఈడీలనే విస్తృతంగా ప్రయోగిస్తోంది. జయలిలిత ఎప్పుడు ఆస్పత్రి పాలయిందో.. అప్పట్నుంచే. మిత్రపక్షాలు జోరుగా పని చేస్తున్నాయి. ఎవరు ఎదురు తిరిగే అవకాశం ఉన్నా… వారిని దారిలోకి తెచ్చే పని చేస్తున్నాయి. ఇటీవలి కాలం గుట్కా మాఫియా పేరుతో.. మంత్రులతో పాటు ఏకంగా డీజీపీని కూడా టార్గెట్ చేశారు. దీనికి కారణం… తోక జాడించడానికి సిద్ధమవుతున్న వారిని నిలువరించడానికేననేది బహిరంగ రహస్యం..!. వారు నెమ్మది అయిన తర్వాత ఆ కేసులు ఎటు పోతాయో ఎవరికీ తెలియదు.
ఇక తెలంగాణలోనూ అదే జరుగుతోంది. రేవంత్ రెడ్డి 2014కి ముందు జరిగిన లావాదేవీలు ఎన్నికల అఫిడవిట్ లో చూపించలేదని.. 2018 ఎన్నికలకు ముందు ఈడీ, ఐటీ అధికారులకు గుర్తుకు వచ్చింది. అంతే.. ఢిల్లీ, ముంబై నుంచి దిగబడిపోయారు. రేవంత్ రెడ్డి కానీ.. కుటుంబసభ్యులు కానీ ఇంట్లో లేకపోతే.. తలుపులు బద్దలు కొట్టీ మరీ సోదాలు నిర్వహించారు. ఇక తెలంగాణ పోలీసులు ఏమైనా తక్కువ తిన్నారా… నయీం కేసు, డ్రగ్స్ కేసు.. ఎంసెట్ లీకేజీ కేసు, మియాపూర్ భూముల కేసు.. ఇలా చెప్పుకుంటూ.. పోతే… దర్యాప్తు చేయకుండా పక్కన పడేసిన కేసులు ఎన్నో ఉన్నా… ఎలాంటి ఫిర్యాదు లేని పధ్నాలుగేళ్ల కిందటి కేసును పట్టుకుని.. జగ్గారెడ్డి అనే కాంగ్రెస్ నేతను జైల్లో వేసే వరకూ.. శాంతించలేదు. దర్యాప్తు సంస్థలను మిత్రపక్షాలుగా చేసుకుని… రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజకీయాలు చేయడం… కామన్‌గా మారిపోయింది.