ఉద్యోగులు అత్యవసరమయినప్పుడు తాము నెలనెలా తమ జీతాలలో నుంచి ఉద్యోగుల భవిష్య నిధికి చెల్లిస్తున్న ప్రావిడెంట్ ఫండ్ లో జమా అయిన మొత్తంలో నుంచి సుమారు 60 శాతం వరకు వెనక్కి తీసుకొనే సదుపాయం ఉంది. సాధారణంగా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలయినప్పుడు వారి వైద్య చికిత్సల కోసం ఉద్యోగులు తాము జమా చేసిన పి.ఎఫ్.సొమ్ములో నుండి కొంత మొత్తం తీసుకొంటూ ఉంటారు. ఏదో విధంగా ప్రభుత్వ ఆదాయం పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రప్రభుత్వం దృష్టి దానిపై పడింది.
ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాలో నుండి డబ్బు వెనక్కి తీసుకొనప్పుడు దానిపై పన్ను విధిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ లో ప్రతిపాదన చేసారు. దానికి ప్రతిపక్షాల నుండే కాకుండా దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. తమ అవసరాల కోసం దాచుకొన్న డబ్బులో నుండి కొంత తీసి వాడుకొంటే దానిపై కూడా పన్ను వేస్తామని చెప్పినందుకు అందరూ కేంద్రప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ప్రజాగ్రహాన్ని చూసి కేంద్రప్రభుత్వం కూడా వెనక్కి తగ్గవలసి వచ్చింది. పిఎఫ్.పై పన్ను విధించాలనే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకొంటున్నట్లు ఇవ్వాళ్ళ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభ సభలో ప్రకటించారు.