విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెంచడానికి కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. చాలా సంతోషం. మరి అదే చట్టంలో పేర్కొన్న మిగిలిన హామీల మాటేమిటి? అని ప్రశ్నిస్తే దానికి మౌనమే సమాధానం అవుతుంది. ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పేర్కొనలేదు కనుకనే ఇవ్వలేకపోతున్నామని భాజపా నేతలు నిత్యం కోరస్ పాడుతుంటారు.
మరి విభజన చట్టంలో రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని ఇంతవరకు ఎందుకు నిలబెట్టుకోలేదు? గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.16,709 కోట్లు లోటు ఏర్పడిందని స్వయంగా ‘కాగ్’ తేల్చి చెప్పిన తరువాత కూడా కేవలం రూ. 2,303కోట్లు మాత్రమే ఇచ్చింది తప్ప ఇంతవరకు కూడా ఆ మిగిలిన మొత్తం ఇవ్వలేదు. ఈ ఆర్దిక సంవత్సరంలో కూడా కేవలం రూ.500 కోట్లు మాత్రమే విదిలిస్తోంది. మిగిలిన రూ. 13,226 కోట్లు ఇంకా ఎప్పుడు ఇస్తుంది? అసలు రెండేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదు?
ఒకేసారి అంత డబ్బు ఇవ్వడం చాలా కష్టమని సరిపెట్టుకొందామంటే, జమ్మూ కాశ్మీర్ కి రూ.80,000 కోట్లు, బిహార్ రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్లు అది కాకుండా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం మరో 40, 000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడియే స్వయంగా ప్రకటించారు. మరి విభజన చట్టంలో హామీ ఇచ్చినా రాష్ట్రానికి 13,226 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.
కేంద్రప్రభుత్వం తనకు ఇబ్బంది లేని హామీలను మాత్రం అమలుచేస్తూ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి అసలు మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. వచ్చే ఎన్నికలలోగా పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని చెపుతోంది కానీ దానికి ఏడాదికి వంద కోట్లు విదిలిస్తోంది. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అప్పజెప్పడం లేదని తప్పించుకొంటోంది. దాని నిర్మాణం పూర్తి చేయాలని తాము అనుకొంటున్నప్పటికీ కేంద్రం దానికి తగినన్ని నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. ఈవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై ఒక ఆటాడేసుకొంటున్నాయి.
రాజధాని నిర్మాణం ఒక అంతులేని వింత కధగా మారిపోయింది. అందులో బొమ్మలు తప్ప మరేమీ కనబడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ దానిని నిర్మించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ ఎవరి లెక్కలు వాళ్ళకి ఉన్నాయి కనుక అదెప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఈవిధంగా విభజన చట్టంలో తనకు పెద్దగా ఇబ్బంది లేని హామీలను చకచకా అమలుచేస్తూ, ఇబ్బందికరమయిన వాటిని మాత్రం కేంద్రం పక్కన పెడుతోంది. ఇప్పుడు ప్రజలు ఏమీ అనలేరు కనుక మౌనంగా, ఓపికగా వచ్చే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.