భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజల దృష్టిలో ఇమేజ్ పెంచుకునే అవకాశం.. రాజధాని విషయంలో వచ్చింది. ప్రజాభిప్రాయం మేరకు.. బీజేపీ రాష్ట్ర శాఖ కూడా తమ నిర్ణయాన్ని తీర్మానంగా చేసింది. విశాఖ బీజేపీ నేతలు.. ఉత్తరాంధ్ర బీజేపీ క్యాడర్ కూడా.. అమరావతి రాజధానిని సమర్థించాయి. అంటే… రాష్ట్రం మొత్తం.. రాజధాని తరలింపు అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయని అర్థం. ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ చేయాల్సింది.. రాష్ట్రంలో పార్టీలు కాదు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి.. అమరావతి విషయంలో అడుగు ముందుకు వేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవడం. అలాంటి చర్యలు తీసుకున్నప్పుడే.. బీజేపీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది.
ఎందుకంటే.. ఇప్పటికే.. కేంద్ర పెద్దలకు చెప్పే.. అమరావతిని మారుస్తున్నామన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు గుట్టుగా చేసేస్తున్నారు. వారి పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ చెబుతున్నారు. అందుకే.. ఇంత గందరగోళం జరుగుతున్నా… సాక్షాత్తూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని తరలించేందుకు నిర్ణయించినా.. మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తమ నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల మాదిరిగా పోరాటం చేస్తాం.. రైతులకు అండగా ఉంటామని.. మాటలు చెబితే నమ్మే పరిస్థితి లేదు. కేంద్రం తల్చుకుంటే.. ఏం చేయగలదో… అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే చూపించారు.
కేసుల లగేజీ ఉన్న.. జగన్ విషయంలో… కేంద్రం కనుసైగ చాలు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ అభిప్రాయాన్ని.. కేంద్ర బీజేపీ పరిగణనలోకి తీసుకోకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకపోతే.. బీజేపీ డబుల్ గేమ్ అడినట్లుగా ప్రజల్లోకి వెళ్లిపోతుంది. అదే జరిగితే.. పవన్ కల్యాణ్‌తో పొత్తు వల్ల కూడా ఒరిగేదేముండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.