శుక్రవారం విడుదలైన సినిమాల్లో `చావు కబురు చల్లగా` ఒకటి. కార్తికేయ – లావణ్య త్రిపాఠీ జంటగా నటించారు. ఈ సినిమా తొలి షో నుంచే డివైడ్ టాక్ మూటగట్టుకుంది. భర్తని కోల్పోయి కంట తడిపెడుతున్న అమ్మాయిని చూసి, హీరో ప్రేమలో పడడం, ఆమె ప్రేమని పొందడానికి రకరకాల పాట్లు పడడం.. ఈ సినిమా కథ. ఆ పాయింట్ కొత్తగానే ఉన్నా, దాన్ని సరైన రీతిలో ఆవిష్కరించలేకపోయాడు దర్శకుడు.
అయితే ఈ పాయింట్ కూడా కొత్తదేం కాదని అర్థమైపోయింది. `నివాసి` అనే షార్ట్ ఫిల్మ్ ఈ సినిమా కథకు ప్రేరణ కావొచ్చని అనిపిస్తోంది. 2020లో విడుదలైన షార్ట్ ఫిల్మ్ నివాసి. అందులోనూ… హీరో ఇలానే హీరోయిన్ ని చావింట చూస్తాడు. తాతని కోల్పోయి ఏడుస్తున్న మనవరాలిపై ఇష్టం ఏర్పరచుకుంటాడు. `చావు కబురు చల్లగా`లో హీరో.. శవాల్ని తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ అయితే, ఇందులో కాటి కాపరి కొడుకు. స్మశానంలోనే నివాసం. చావు కబురు చల్లగాలో హీరో- హీరో తల్లీ ఇద్దరూ మందు కొడుతుంటారు. ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ అంతే. రెండు కథల్లోనూకొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. దాంతో.. `నివాసి` చూసుకునే ఈ కథని దర్శకుడు అల్లుకున్నాడన్న విమర్శలు, పోలికలు మొదలెట్టేశారు. మరి.. ఇందులో నిజమెంతో ఆ దర్శకుడికే తెలియాలి. ఒకవేళ ఈసినిమా హిట్టయితే…`కథ నాదే` అనే పోరు మొదలయ్యేదేమో..? ప్లాప్ టాక్ రావడంతో ఆ బాధ తప్పిందంతే.