రేటింగ్: 2/5
అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలదే రాజ్యం ఇప్పుడు. ఓ మెట్టు దాటి… ఆలోచిస్తేనే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఆ ప్రయత్నంలో మెట్టు పైన అడుగు వేస్తున్నామా? లేదంటే కిందకి వెళ్లిపోతున్నామా? అనేది ఆలోచించాలి. కొన్ని ఆలోచనలు చెప్పుకోవడానికి బాగుంటాయి. తీస్తే… చప్పగా తయారవుతాయి?. ఇదేం థాట్..? అసలు ఇదేం కథా..? అని ఎగతాళి చేసేలా చేస్తాయి. `చావు కబురు చల్లగా`కే వద్దాం…. శవాల్ని మోసుకుపోయే.. బస్తీ బాలరాజుకీ, తన చేతుల్లో పుట్టుకను చూసే.. ఓ `సిస్టర్`కి మధ్య ప్రేమ కథ చెప్పాలనుకోవడం మంచి ఆలోచన. దర్శకుడు ఓ డైలాగులో చెప్పినట్టు `చావుకీ, పుట్టుకకీ మధ్య ప్రేమకథ`. దాన్ని ట్రీట్ చేయడంలో తేడా చేస్తే, ఫలితం మొదటికే మోసం వస్తుంది. మరి… దర్శకుడు ఈ కథకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చాడు? ఓ మెట్టు పైకెక్కే ఆలోచన అనిపించిందా? కిందకు దిగజారిపోయే.. కథగా మలిచాడా?
కథలోకి వెళ్తాం.. బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాల్ని మోసుకుపోతుంటాడు. చావు తనకు పరమ రొటీన్. భర్త పోయి.. పుట్టెడు దుఖఃంలో ఉన్న మల్లిక (లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమిస్తాడు. తన వెంట పడతాడు. వేధిస్తాడు. చివరికి ఎలాగోలా.. తనవైపుకు తిప్పుకుంటాడు. ఇంట్లో అమ్మ గంగమ్మ (ఆమని)ది మరో కథ. భర్త.. మంచం మీద ఉంటాడు. తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మరో వ్యక్తి మోహన… ఉంటాడు. ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటాడు.. బాలరాజు. మరి తాను ప్రేమించిన అమ్మాయితో బాలరాజుకి పెళ్లయ్యిందా? తన తల్లినీ – మోహననీ… బాలరాజు కలిపేశాడా? అనేది మిగిలిన కథ.
భర్తపోయి పుట్టెడు దుఖంలో ఉండే అమ్మాయిని… తన ఏడుపు చూసి ప్రేమిస్తాడు హీరో.నాన్న బతికి ఉండగానే, అమ్మకి మరో పెళ్లి చేయాలనుకుంటాడు. ఇదంతా చూసి `ఇదేం కొంప..? ఇవేం దిగజారుడు పనులు` అంటూ.. మురళీ శర్మ.. నెత్తీ నోరూ కొట్టుకుంటాడు. దాదాపు ప్రేక్షకుల పరిస్థితీ అదే.శవం దగ్గర ఏడుస్తున్న హీరోయిన్ ని చూసి.. హీరో మనసు పడడం… కామెడీగా అనిపిస్తుంది. కామెడీ బిట్లకు అది పనికొస్తుంది కూడా. కానీ.. చనిపోయింది ఆమె భర్త అయితే. దహన సంస్కారాలు అయిన రోజే.. ఆ అమ్మాయితో `నేను నిన్ను ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా` అని హీరో అంటే…? ఆ కథని ఏమనాలి? మాటిమాటికీ ఆ అమ్మాయి ఇంట్లో చొరబడి.. `ఇంకా వాడ్నే తలచుకుని ఏం ఏడుస్తావ్.. నన్ను కట్టుకో. సుఖపెడతా` అని హీరో అంటే..? వాడ్ని హీరో అంటామా? థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్న ప్రేక్షకుడికే… సదరు హీరో విలన్ గా కనిపిస్తుంటే, ఆ కథకు ఏం కనెక్ట్ అవుతాం?
ఆమనిది మరో ట్రాక్. తల్లీ కొడుకులు ఇద్దరూ మందు కొడుతుంటారు. తల్లి సైడ్ ట్రాక్ పట్టడం చూసిన కొడుకు.. `మా అమ్మ రంకు చేస్తుందేంట్రా` అంటూ ఫ్రెండుతో చెప్పుకుని తెగ బాధపడుతుంటాడు. అసలు ఇలాంటి సెన్సిటీవ్ సీన్స్‌ని ప్రేక్షకుడు భరించగలడా? దాన్నీ పక్కన పెట్టేద్దాం. `నాన్నతో ఎలాగూ సుఖపడలేవు. నేను నీకు కొడుకులా ప్రేమని పంచగలను. భర్తలా కాదు. కాబట్టి.. నువ్వు ఇంకొకడ్ని పెళ్లి చేసుకో` అని కొడుకుతో చెప్పించి, నాన్న ఉండగానే తల్లికి మరో తండ్రిని వెదకాలని చూడడం… ఏం ఆలోచనలు. ఇవి అవుటాఫ్ ది బాక్స్ ఐడియాలు అనుకోవాలా?
ఇంట్రవెల్ లో హీరో, హీరోయిన్ల మధ్య ఓ భారీ ఎమోషనల్ సీన్ పెట్టాడు దర్శకుడు. `నేను పుట్టుకల్ని దగ్గర నుంచి చూస్తాను. ఓ బిడ్డ పుట్టేటప్పుడు ఆనందం చూస్తాను. నువ్వు చావుల్ని చూస్తావు. మన ఇద్దరికీ కలవదు..` అని హీరోయిన్ చెబుతుంది. `ఇది మన ఇద్దరి ప్రేమకథ కాదు.. చావు పుట్టుకల ప్రేమకథ` అని మరో భారీ డైలాగ్ పేలుస్తాడు హీరో. దాన్ని బట్టి చూస్తే, చావు పుట్టుకల ఫిలాసఫీ ఏదో సెకండాఫ్‌లో చెబుతాడనుకుంటారు. కానీ.. `పైన పటారం – లోన లొటారం` అంటూ ఓ ఐటెమ్ సాంగ్ తో సెకండాఫ్ కి శ్రీకారం చుట్టిన దర్శకుడు.. కథ కూడా అదే టైపు అని చెప్పకనే చెప్పాడు. సినిమా అంతా చావు గోలే. వాటి మధ్య ఓ ప్రేమకథని (అసలు దాన్ని ప్రేమ అంటారా)ని వెదుక్కోమంటాడు దర్శకుడు. ఇంట్రవెల్ ముందు అంత ఫిలాసఫీ చెప్పిన హీరోయిన్.. ఇంట్రవెల్ తరవాత… బాలరాజుని ఎలా ప్రేమించేసిందో అర్థం కాదు.
బాలరాజుకి ఏం కావాలో కార్తికేయ అవి ఇచ్చేశాడు. ఆ పాత్రలో ఉండే నిర్లక్ష్యం తన కళ్లలోనే చూపించేశాడు. నటుడిగా కార్తికేయ మళ్లీ పాస్. కానీ ఏం లాభం? ఇలాంటి కథల్ని ఎంచుకుని తన కెరీర్‌ని ఎటు మళ్లిస్తున్నట్టు అనిపిస్తుంది. లావణ్య త్రిపాఠి తొలి సీన్ నుంచి చివరి వరకూ ఒకే టెంపో లో కనిపిస్తుంది. ఏ ఫ్రేములో చూసినా ఒకేలా ఉంటుంది. ఆమనికి మంచి పాత్ర పడింది. మురళీ శర్మ.. ఎప్పటిలా… తన వంతు చేసుకుంటూ వెళ్లిపోయాడు.
దర్శకుడు ఈ పాయింట్ ని ఎలా కన్వెన్స్ చేస్తాననుకున్నాడో ఏమో..? ధైర్యం చేసి ముందడుగు వేసేశాడు. చాలా రిస్కీ పాయింట్ ఇది. అటూ ఇటూ అయితే… తనపై విమర్శలు వస్తాయి. ఆ విషయం తెలిసి కూడా ధైర్యం చేసేశాడు. ఇప్పుడు తను ఈ విమర్శల్ని మోయాలి కూడా. పాటలు హుషారుగా ఉన్నాయి. ప్రతీ పాటలోనూ చావుకి సంబంధించిన ఫిలాసఫీనే. మాటల్లోనూ అవే దొర్లాయి.
అడుగడుగునా… సగటు ప్రేక్షకుడికి జీర్ణం కాని విషయాలే తెరపై కనిపిస్తుంటాయి. మనం కనెక్ట్ కాని, కాలేని ట్రాకుల్ని పట్టుకుని… దాన్ని రెండు గంటల సినిమాగా మలుద్దామన్న ఆలోచన రావడం, దానికి గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు ముందుకొచ్చి చేయూతనివ్వడం – ఆశ్చర్యపోయే విషయాలు.
ఫినిషింగ్ టచ్: చావు డప్పు
రేటింగ్: 2/5