హైదరాబాద్: తిరుమల వెంకటేశ్వరస్వామివారి లడ్డు ప్రసాదంపై సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు ప్రత్యేకత తగ్గిందని, గతంలోలాగా ఆ లడ్డు ఇప్పుడు నిల్వ ఉండట్లేదని చెప్పారు. లడ్డు కౌంటర్లలో ఉండే సిబ్బంది భక్తులను మోసగిస్తున్నారని అన్నారు. సిబ్బందికి జీతాలు తక్కువగా ఉండటంతో వారు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత శ్రీవారి సేవకులతో మరిన్ని లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా కొన్ని విక్రయకేంద్రాలను శ్రీవారి సేవకులకు కేటాయించామని, అవి విజయవంతం కావటంతో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లడ్డు విక్రయ కేంద్రాల నిర్వహణలో కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. లడ్డులపై ఇటీవలికాలంలో ఫిర్యాదులు పెరుగుతుండటంతో చదలవాడ ఇవాళ టీటీడీ అధికారులతో కలిసి లడ్డు విక్రయకేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు జరిపారు.
మరోవైపు తిరుపతి, తిరుచానూరు, కపిలతీర్థం, శ్రీనివాస మంగాపురం ప్రాంతాలను ఆకాశంనుంచి వీక్షించటంకోసం ఏపీ పర్యాటకశాఖ, పవన్ హాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ సేవలు నిన్న ప్రారంభమయ్యాయి. చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి నగరంలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో ఈ సేవలను ప్రారంభించారు. పదినిమిషాల ఈ హెలికాప్టర్ టూర్కు రు.1,999 వసూలు చేస్తున్నారు.