ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన భాష సరిగా ఉండటం లేదనీ, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అన్నారు. నోరుని విచ్చలవిడిగా పారేసుకుంటే అది హుందాతనం కాదన్నారు. తాను కూడా అలానే మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటారన్నారు. మీకు హుందాతనం లేకపోవచ్చుగానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానానికి ఉంటుందనీ, దానికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నారు. సభలో ప్రతీరోజూ పులివెందుల పంచాయితీ జరుగుతోందనీ, ఆయన శాసిస్తాడు.. స్పీకర్ ఆచరిస్తారని అన్నారు. వారిని చూసి భయపడిపోయేవారు ఎవ్వరూ ఇక్కడ లేరన్నారు.
తెలంగాణకు మనం నీళ్లు తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదనీ, రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సి ఉందన్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టును తాము ఆనాడే చెప్పామనీ, అది తక్కువ ఖర్చుతో జరిగేదన్నారు. అవసరమైతే నాగార్జున సాగర్ కి మన నీళ్లను మనమే లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు. అక్కడి (తెలంగాణ) నుంచి కిందికి నీళ్లే రావన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారనీ అది సరికాదన్నారు. మన నీళ్లను మనమే వాడుకుందామనీ, వాళ్లకి అవసరమైతే మనకు మిగిలిన జలాలు ఇద్దాం అన్నారు. అంతేగానీ, వేరేవాళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడితే భావితరాలు క్షమించవన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో డబ్బు పంపించి సాయం చేశారని ఇలా నీళ్లను ధారాదత్తం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. దీనిపై రాష్ట్రంలోని రైతులు, యువత, ఇంజినీర్లు, అన్ని వర్గాల్లో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. లక్షాయాభైవేల కోట్లు దీని కోసం అంచనా వేశారనీ, వాళ్లవి నాలుగు జిల్లాలు, మనవి ఎనిమిది జిల్లాలని అంటున్నారన్నారు. మనం డబ్బులు ఖర్చుపెట్టాక రేపు వాళ్లకి కోపం వస్తే… మన పరిస్థితి ఏంటన్నారు? ఇక్కడ కేసీఆర్, జగన్ ఇద్దరూ పర్మనెంట్ కాదనీ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు మాత్రమే శాశ్వతం అన్నారు.
గోదావరి – కృష్ణ జలాల మళ్లింపుపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక భారీ ప్రాజెక్టుకి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలూ కలిసి జలాలను సద్వినియోగం చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అయితే, భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు వస్తాయనేది టీడీపీ అభిప్రాయం. నిజానికి, నదీ జలాల వినియోగం విషయంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన హక్కులూ వాటాలూ ఆ రాష్ట్రానికి స్పష్టంగా ఉండటమే సరైందని చెప్పొచ్చు. ఉమ్మడిగా హక్కులూ వాటాలూ ఉంటే… మారే ప్రభుత్వాలను బట్టీ వాటి పంపకాల్లో హెచ్చుతగ్గులూ తేడాలూ వచ్చే ఆస్కారం ఉంటుందనడంలో సందేహం లేదు. టీడీపీ వెల్లడించిన ఈ అభిప్రాయాన్ని అధికార పక్షంవారు సూచనగా తీసుకుంటారో, ఒక రాజకీయ విమర్శ కింద జమకట్టేసి లైట్ తీసుకుంటారో చూడాలి.