చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ లో సలహాదారుగా నియమించింది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఆయన ప్రయత్నం చేయనున్నారు. ప్రవచనకర్తగా ఆయన తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులు తక్కువ కావు. జీవితాన్ని మంచి విలువలతో ముందుకు నడిపించడానికి అవసరమైన ప్రేరణ ఆయన ప్రసంగాల్లో ఉంటుంది. అందుకే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థలు కూడా తమ విద్యార్థులు, ఉద్యోగులకు చాగంటి వారి ప్రసంగాలను ఏర్పాటు చేస్తూంటాయి.
అయనకు ఉన్న పేరు ప్రఖ్యాతుల కారణంగా .. గతంలో రాజకీయంగా ఆయనను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని పదవుల్ని ప్రకటించారు. కానీ వాటిని ఆయన నిరాకరించారు. ప్రస్తుతం అంగీకరించడానికి కారణం .. తనకు ఇష్టమన సబ్జెక్ట్.. యువతను సరైన దారిలో పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేసేలా అవకాశం కల్పించడమే. విలువలతో కూడిన విద్య, నడవడిక ఉన్నప్పుడే వచ్చే విజయాలు కూడా నిలకడగా ఉంటాయి. అడ్డదోవలో వెళ్తే తాత్కలికంగా విజయాలు లభించవచ్చు కానీ అంతిమంగా పతనానికి దారి తీస్తుంది.
మన దేశంలోనే కాదు..రాష్ట్రంలో కూడా విద్య అనేది ఓ వ్యాపారవస్తువుగా మారిపోయింది. విజ్ఞానాన్ని బుర్రల్లోకి ఎక్కించడమే అసలైన చదువు అనుకుంటున్నారు. కానీ సంస్కారం, విలువలు నేర్పే పరిస్థితి ఉండటం లేదు. చిన్న ఎదురుదెబ్బకే కుంగిపోవడం.. విజయం వస్తే పొంగిపోవడం .. వంటివి తదుపరి లక్ష్య సాధన మీద ప్రభావితం చేస్తాయి వాటిని ఎలా అధిగమించాలో ఎవరూ నేర్పరు. జీవిత పాఠాలతో నేర్చుకున్నవారే ముందడుగువేస్తారు. ఆ పాఠాలు చెప్పేవారెవరుంటారు ?
చాగంటి కోటేశ్వరరావు ఒక్కరే సలహాదారుగా పదవి తీసుకున్నంత మాత్రాన మొత్తం మార్చేస్తారని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. సమాజం కూడా మార్పు కోసం ప్రయత్నించాలి. విద్యార్థులు ఆయన చెప్పే సందేశాల ప్రకారం తమను తాము తీర్చిదిద్దుకునేలా చేయడానికి సహకరిస్తే.. సమాజం మరింత మెరుగవుతుంది. చాగంటి వారు చెప్పే మాటల్లో కులం ఉండదు.. మతం ఉండదు.. మంచి .. మానవత్వం.. విలువలే ఉంటాయి.