జగన్ రెడ్డి ఎవర్ని బెదిరించాలనో.. లేకపోతే ఆస్తులు లాక్కోవాలనో ఏ ముహుర్తంలో ఎన్సీఎల్టీలో కేసు వేశారో కానీ ఆయన ప్రవర్తన ఎలాంటిదో అందరూ అఫిడవిట్ల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. మొదటి షర్మిల, తర్వాత విజయలక్ష్మి..తాజాగా చాగరి జనార్ధన్ రెడ్డి అనే మరో డైరక్టర్ వేసిన అఫిడవిట్లు జగన్ ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంటుందో సర్టిఫికెట్ల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నాయి.
సరస్వతి పవర్ లో ఓ డైరక్టర్ గా ఉన్న చాగరి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి జగన్ ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ వేశారు. చట్టప్రకారమే వాటాల బదిలీలు జరిగాయని.. బోర్డు ఆమోదించిందని ఇప్పుడు వాస్తవాలు దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ వివాదాల్లో ఎన్సీఎల్టీని భాగం చేసి..ఏదో చేయాలనుకుంటున్నారని ఆయన అఫిడవిట్ లో స్పష్టం చేశారు. కుటుంబ గొడవలను పరిష్కరించుకోవడానికి కార్పొరేట్ లాక్ అడ్డం పెట్టుకునే కుట్ర చేశారని తెలిపారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ అసలు చెల్లుబాటు కాదన్నారు. విజయమ్మ, షర్మిలపై జగన్ చేసిన ఆరోపణలకు సరస్వతి పవర్ కంపెనీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
ఇంతకు ముందు షర్మిల, విజయమ్మ కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు. జగన్ రెడ్డి ఇంత ఘోరానికి తెగబడతాడని అనుకోలేదన్నట్లుగా వారి అఫిడవిట్లు వేశారు. అన్నీ అబద్దాలు చెప్పి కుటుంబ ఆస్తిని కొట్టేసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అఫిడవిట్లు జగన్మోహన్ రెడ్డికి కండక్ట్ సర్టిఫికెట్లుగా మారుతున్నాయి. కుటుంబసభ్యులతోనే ముఖ్యంగా తల్లి, చెల్లితోనే ఆయన వ్యవహరిస్తున్న తీరు.. అక్రమంగా ఆస్తులు కొట్టేసే ప్రయత్నం చేయడం వంటివి ఆయన నైజాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఈ అఫిడవిట్ల రూపంలో కళ్ల ముందు ఉన్నా.. వైసీపీ నేతలు డ్రామాలతో ఎవరినో మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఓ సారి నిజస్వరూపం చేసిన వాళ్లు మళ్లీ మళ్లీ నమ్ముతారా?