భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని..అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇప్పుడు.. ఇంటా బయటా విమర్శల పాలవుతోంది. ఈ ప్రకటనను..చైనా తనకు అనుకూలంగా మల్చుకుంది. స్వయంగా భారత ప్రధానమంత్రినే చైనా బలగాలు.. ఇండియా భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్పారని… అంటే.. ఏం జరిగిందో సులువుగా అర్థం చేసుకోవచ్చని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి… ప్రకటించారు. అసలు అక్కడేం జరిగిందో… ఆయన వివరిస్తూ.. ట్వీట్లు చేశారు. మోడీ ప్రకటన ఆధారంగా.. గాల్వన్ లోయ పూర్తిగా చైనా అధీనంలో ఉందని.. అది చైనాకు సొంతమని వాదించడం కూడా ప్రారంభించారు.
మోడీ ప్రకటన.. ఆ తర్వాత చైనా స్పందనతో.. దేశంలో కూడా గగ్గోలు రేగింది. మన భూభాగంలోకి చైనా వాళ్లు రాకపోతే… ఘర్షణ ఎలా జరిగింది.. ఇరవై మంది ఎందుకు అమరవీరులయ్యారో.. ప్రధాని చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోడీ తన ప్రకటన ద్వారా గాల్వన్ లోయను చైనాకు అప్పగించేశారని విమర్శలు గుప్పించారు. దీనిపై అమిత్ షా స్పందించారు. రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే..శివసేన కూడా..చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటనను.. కోట్ చేస్తూ.. మోడీ ప్రకటనపై విమర్శల వర్షం కురిపించింది. గాల్వన్ లోయ తమదే అంటున్న చైనా వాదనకు..మోడీ ప్రకటన బలం ఇచ్చినట్లయిందని..దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విమర్శలు ఇలా పెరిగిపోతూండటంతో కేంద్రం కూడా స్పందించింది. ప్రధాని ప్రకటనకు దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారంటూ..ఖండించింది. కానీ.. జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయినట్లయింది.