తెలంగాణలో ఎమ్మెల్సీలు అధికారగూటికి చేరుతున్నారు. ఇటీవల ఒకేసారి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ వచ్చి, ఎల్పీని విలీనం చేస్తారని కాంగ్రెస్ అంటుంటే… పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంది.
ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. నల్గొండలో చిట్ చాట్ చేస్తూ అనర్హత వేటుపై కీలకమైన కామెంట్స్ చేశారు.
గతంలో ఎమ్మెల్సీలు పార్టీలు ఫిరాయించారు. పలు కోర్టు తీర్పులున్నాయి. ఎమ్మెల్సీల అభిప్రాయాలు కూడా తీసుకున్న చైర్మన్లు కూడా ఉన్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే తన నిర్ణయం ఉంటుందని, కొంత సమయం పట్టినా సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు.
మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుఖేందర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి అధికారికంగా పార్టీ కండువా కప్పుకోలేదని… ఆయన కూడా అనధికారికంగా కాంగ్రెస్ లో చేరినట్లేనంటూ నల్గొండ బీఆర్ఎస్ క్యాడర్ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో, గుత్తా నిర్ణయం ఆసక్తికరంగా మారింది.