తెలంగాణలో 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజీ కేసులో శ్రీచైతన్య లింక్ బయటకు వచ్చింది. శ్రీచైతన్యకు సంబంధించిన ఆరు కాలేజీలకు ఇన్చార్జ్ గా ఉండి.. డీన్ వ్యవహరిస్తున్న వాసుబాబు అనే వ్యక్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాసుబాబుతో పాటు ఆయన నియమించుకున్న ఏజెంట్ శివనారాయణ కూడా సీఐడీ పోలీసులకు చిక్కారు. ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజీ కేసులో డాక్టర్ దనుజయ్ ఠాకూర్, డాక్టర్ సందీప్ కూమార్ అనే ఇద్దరు ప్రధాన నిందితులను… పోలీసులు ఇది వరకే అరెస్ట్ చేశారు. వీరి కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు.. శ్రీచైతన్య లింక్‌ను కనిపెట్టారు.
శ్రీచైతన్యకు చెందిన ఆరుగురు విద్యార్థులతో.. వాసుబాబు..భువనేశ్వర్ లో క్యాంప్ నిర్వహించారు. పేపర్ లీకేజీకి సంబంధించి వాసుబాబు.. ప్రధాన నిందితులతో పలుమార్లు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోనే ఈ సమావేశాలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. భువనేశ్వర్‌లో వీరు నిర్వహించిన క్యాంపులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు విద్యార్థులకి మెడికల్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి. ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ. 30 లక్షల చొప్పున ఆరుగురు విద్యార్థులను నుండి సుమారు రెండు కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
2016లో మొత్తం రెండు సార్లు ఎంసెట్ మెడికల్ పేపర్లు తెలంగాణలో లీకయినట్లు సీఐడీ గుర్తించింది. మొదట్లో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. కానీ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో..సీఐడీ విచారణకు ఆదేశించింది. చివరకు అనుమానాస్పదంగా ర్యాంకులు వచ్చిన వారి వ్యవహారంపై విచారణ జరపగా.. గుట్టు మొత్తం బయటపడింది. కోట్లలో డీల్స్ చేసుకుని… ఇతర రాష్ట్రాల్లో క్యాంపులు నిర్వహించి.. పేపర్లను ప్రాక్టీస్ చేయించి మరీ ఎగ్జామ్ హాల్స్ వద్ద వదిలి పెట్టేవారు. ఈ విషయాలన్నింటినీ సీఐడీ బయటకు తీసింది.
ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్లోనే పేపర్ లీకయినట్లు గుర్తించారు. కానీ ఇప్పటి వరకూ కార్పొరేట్ కాలేజీల హస్తం గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. తొలిసారి శ్రీచైతన్య కాలేజీ డీన్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆరు కాలేజీలకు ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్న వాసుబాబు విషయాన్ని మరింత లోతుగా పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. ర్యాంకుల విషయంలో కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడని కార్పొరేట్ కాలేజీల రేసులో శ్రీచైతన్య ముందు ఉంటుంది. ఇప్పుడీ కేసు.. శ్రీచైతన్య మెడకే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. వాసుబాబు.. శ్రీచైతన్య విద్యార్థులకే క్యాంపునకు తీసుకెళ్లాడు కాబట్టి వ్యవస్థీకృతంగా ఏమైనా జరిగిందా అన్నదాన్ని పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కేసు ఇంతటితో ఆగిపోయే అవకాశాలైతే లేవని.. సీఐడీ పోలీసు వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.