`ఛయ్య ఛయ్యా’ మాంచి హుషారెక్కించే హిందీపాట. ఈపాటకు చరిత్ర తెలుసుకుంటున్నా అంతే హుషారుపుడుతుంది. ఖండాంతరాలు పాకిన పాటఇది. అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో ఉత్సాహం నింపిన పాట. అమెరికా సినిమా, టివీ సీరియల్ లో దూరిన పాట… ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇప్పుడు కొంతైనా చెప్పుకోవాలి ఎందుకంటే…
షారూఖ్ ఖాన్, మనీషా కోయరాలా నటించిన దిల్ సే హిందీ చిత్రం 1998లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో `ఛయ్య ఛయ్యా… ‘ అన్నపాట ఇప్పుడు వింటున్నా తెలియని ఉత్సాహం కమ్మేస్తుంది. సినిమాతోపాటు ఈ పాటకు కూడా 17ఏళ్లు వచ్చేశాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా కథ తీవ్రవాద సమస్యలపై రూపొందించినదే. అసలు హీరోయినే టెర్రరిస్ట్. ఈ పాటచిత్రీకరణకు ముందు మొదట్లో శిల్పా శిరోద్కర్ ను డాన్స్ కోసం ఎంపికచేశారు. కానీ శిల్పా కాస్తంత బొద్దుగా ఉందన్న కారణంతో పక్కనపెట్టేసి మల్లికా అరోరాను తీసుకున్నారు. ఈపాటతో మల్లికా అరోరాపేరు మారుమ్రోగింది.
పాటంతా రైలుమీదనే చిత్రీకరించడం ఓ స్పెషల్. ఎ.ఆర్. రహమాన్ చక్కటి స్వరకల్పనచేశారు. సుఖిందర్ సింగ్, సప్నా అవస్తి నేపథ్యగానంఅందించారు. సినిమా వచ్చిన నాలుగేళ్లకు బిబిసీ వరల్డ్ సర్వీస్ పాటలమీద అంతర్జాతీయ పోల్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడువేల పాటలు ఎంపికచేసి పోల్ నిర్వహించారు. 155దేశాల్లో పోల్ నిర్వహించగా ఛయ్య ఛయ్యా పాట టాప్ టెన్ లో (9వ స్థానంలో) సగర్వంగా నిలిచింది.
జనపదం నుంచి …
సుఫీ వర్గానికి చెందిన జానపద గేయం `తయ్య తయ్యా’ నే, ఈ ఛయ్య ఛయ్యా పాటకు ఆధారం. మణిరత్నం ఓ పంజాబీ భక్తిగేయం కోసం ఆలోచిస్తున్నప్పుడు గాయకుడు సుఖవిందర్ సింగ్ ఈ గేయాన్ని (తయ్య తయ్యా) మణిరత్నంకు సూచించాడు. అయితే గుల్జార్ లిరిక్స్ మార్చిరాశారు. అలా `ఛయ్య ఛయ్యా’ గేయం పుట్టింది. పాట బయటకురాగానే అన్ని వర్గాలవారికి బోలెడంత నచ్చేసింది. ముఖ్యంగా ప్రయాణాలప్పుడు సరదాగా ఈపాట ఎక్కువగా పాడుకోవడం మొదలుపెట్టారు. ఎల్లలుదాటి ఈ పాట ప్రపంచమంతటా మారుమ్రోగింది. మరీ ముఖ్యంగా యు.కెలో ఈ పాటకు మంచిఆదరణ దక్కింది. గుల్జార్ కు 1999లో ఉత్తమ గేయరచయిత అవార్డు దక్కింది. అంతేకాదు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డులు కూడా ఈపాటవల్లనే దక్కాయి.
రైలెక్కన పాట
పాట చిత్రీకరణ ఊటీలో జరిగింది. పాటంతా రైలుమీదనే సాగుతుంది. నీలగిరి మౌంటెన్ రైల్వే నడిపే రైలుని షూటింగ్ ఎంపికచేశారు. సినిమాకథ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో చిత్రీకరించాలి. కానీ ఈపాటకు ఊటీనే అనుకూలంగా ఉంటుందని మణిరత్నం భావించారు. అంతే యూనిట్ మొత్తం ఊటీకి చేరుకుంది. కొండప్రాంతంలో నిదానంగా వెళ్ళే రైలుఅది. టాప్ లేని బోగీలో ప్రయాణీకులు ఉత్సాహంగా పాడుకునే పాటగా దీన్ని చిత్రీకరించారు. హీరో షారుఖ్ ఖాన్ , మల్లికా అరోరా ఇంకా కొంతమంది డాన్సర్లతో రైలుపెట్టలోనే నృత్యంచేస్తూ పాడతారు. కదులుతున్న రైలుమీద ఫొటోగ్రాఫర్ సంతోష్ సివన్ చాలానేర్పుగా పాటచిత్రీకరణ పూర్తిచేశారు. ఆరోజుల్లోనే చక్కటి కొరియోగ్రఫీతో సాగిన పాటఇది. ఫార్హ్ ఖాన్ ను ఇందుకు అభినందించాలి. పాట చిత్రీకరణ ఎలా చేశారు అలాగే, ఎలాంటి మార్పులుచేయకుండానే ఉపయోగించడం మరో విశేషం.అంటే బ్యాక్ ప్రొజెక్షన్స్ , పోస్ట్ ప్రొడెక్షన్స్ వర్క్స్ లేకుండానే , స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉపయోగించకుండానే పాటను ఒకే చేశారు దర్శకుడు మణిరత్నం.
ఈ పాట చిత్రీకరణ గురించి అలనాటి మోడల్, నటి మల్లికా అరోరా తర్వాత ఓ సందర్భంలో మాట్లాడుతూ, `మీరు నమ్మరేమోకానీ, ఇది నిజం, ఛయ్య ఛయ్యా పాట ఎలా చిత్రీకరించారో అలాగే తెరమీద కనిపించింది. కెమేరా ట్రిక్స్ లేవు, బ్యాక్ ప్రొజెక్షన్ , పోస్ట్ ప్రొడెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివి లేనేలేవు కాకపోతే పాట చిత్రీకరణ సమయంలో సిబ్బందిలో ఒకతను రైలుమీద నుంచి క్రిందపడి గాయపడ్డాడు. ఇదొక్కటి తప్ప మిగతా చిత్రీకరణ అంతా సజావుగానే సాగిపోయింది’
క్రీడా సంబరాల్లో..
ఈ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందంటే, 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభవేడుకల్లో ఈపాట మారుమ్రోగింది. `బొంబాయ్ డ్రీమ్స్’ సిడీ ఆల్బమ్ లో `ఛయ్య ఛయ్యా’ సాంగ్ కూడా చోటుచేసుకుంది. అలాగే, 2006లో విడుదలైన అమెరికన్ క్రైమ్ థిల్లర్ `ఇన్ సైడ్ మ్యాన్’ లో ఈపాట సౌండ్ ట్రాక్ ను వాడుకున్నారు. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్ లో `ఛయ్య ఛయ్యా’ పేరు వేశారు. అలాగే ఎండ్ క్రెడిట్స్ కూడా ప్రస్తావించారు. అలాగే, అమెరికన్ టెలివిజన్ సీరియల్ `స్మిత్’ లో కూడా ఈపాట మారుమ్రోగింది. 2011 నుంచి ఇండోనేషియాలో కూడా ఈ పాట పాపులరైంది. ఇలా చెప్పుకుంటూపోతుంటే ఈపాటకు చరిత్ర చాలానే ఉంది.
– కణ్వస