తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థి అవుతారనుకున్న చలమలశెట్టి సునీల్.. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం టీడీపీ అధినేతను కలిశారు. పార్టీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. వచ్చే నెల రెండో వారంలో.. ఆయన టీడీపీలో చేరనున్నారు. చలమలశెట్టి సునీల్ 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2009లోనూ.. పీఆర్పీ అభ్యర్థిగా అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండు సార్లు కూడా .. స్వల్ప తేడాతోనే ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వతా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నా… జగన్ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఇటీవలి కాలంలో తూర్పుగోదావరి వైసీపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొంత మంది పార్టీని గుప్పిట పట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో సునీల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించేశారు. జగన్ పాదయాత్రకు కూడా సునీల్ దూరంగా ఉన్నారు. ప్రధాన సామాజిక వర్గానికి చెందిన సునీల్‌ను పార్టీలోనే ఉంచేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దానికి కారణం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెత్తనమే కారణమని సునీల్ వర్గీయులు చెబుతున్నారు. వైసీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. ముందు నుంచీ వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్‌తో ఆయనకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దాంతో ద్వారంపూడిని కాదని సునీల్‌కు ప్రాధాన్యత ఇవ్వక.. ఆయనను వదులుకున్నారు జగన్.
వైసీపీ కాకినాడ లోక్‌సభ కోఆర్డినేటర్‌గా ఉన్న చలమలశెట్టి సునీల్.. జిల్లా రాజకీయాలలో ప్రాధాన్యం ఉన్న సామాజిక వర్గం. పార్టీలకు అతీతంగా సునీల్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పారిశ్రామిక కుటుంబానికి చెందిన సునీల్‌కి ఈ జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో మంచి పట్టుంది. ఇవన్నీ జగన్‌కి తెలిసినా.. పరోక్షంగా ద్వారంపూడికే సపోర్టు చేశారు. రాజ్యసభ ఎన్నికలకు ముదే టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. మూడో అభ్యర్థిగా సునీల్‌ను నిలబెడతారని చెప్పుకున్నారు. కానీ అప్పట్లో మూడో అభ్యర్థిని టీడీపీ నిలబెట్టలేదు. ప్రస్తుత కాకినాడ ఎంపీ తోట నరసింహం.. ఈ సారి పోటీకి దూరంగా ఉండాలని అనుకుటున్నారు. ఏదో ఓ అసెంబ్లీ స్థానం నుంచి తన భార్య, మెట్ల సత్యనారాయణ కుమార్తె అయిన శ్రీవాణిని నిలబెట్టాలనుకుంటున్నారు. దాంతో సునీల్‌కు కాకినాడ సీటు ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.