ఇప్పుడంటే బాబాయ్ పాత్రలు వేసుకుంటూ.. సాఫ్ట్‌గా కామెడీ చేస్తున్నాడు గానీ, ఒకప్పుడు వెండి తెరపై చలపతి రావునిచూడ్డానికే భయం వేస్తుంది. వరుసగా విలన్ వేషాలు వేస్తున్నప్పుడు, వెండి తెర ‘రేపిస్టు’గా పేర్గాంచినప్పుడు చలపతిరావు పేరు చెబితేనే అమ్మాయిలు హడలిపోయేవారు. ఆయన్ని చూడ్డానికి కూడా సాహసించేవారు కాదు. అలాంటి చలపతి రావుకి ఓ ప్రేమకథ ఉంది. అదీ.. పందొమ్మిదేళ్లకే.
చలపతిరావు బందరులో పీయూసీ చదువుతున్నప్పుడు ఓ అమ్మాయి ఇష్టపడింది. ఆ విషయం నేరుగా చలపతిరావు దగ్గరకే వెళ్లిచెప్పింది. ‘నన్ను పెళ్లిచేసుకుంటావా’ అని. అంతే.. చలపతి బాబాయ్ ఫ్లాటు. ఇంట్లో అందరికంటే చిన్నవాడు. పెళ్లికావల్సిన అన్నలున్నారు. అయినా సరే, రహస్యంగా పెళ్లి చేసుకుని, ఆ విషయాన్ని ఇంట్లో దాచి, గుట్టుగా సంసారం వెళ్లదీశాడు. ఆ తరవాత అన్నయ్యకు తెలిసి గోల పెడితే… అన్న పెళ్లిని తానే దగ్గరుండి చేయించాడు. అయితే.. కొన్నాళ్లకు చలపతిరావుభార్య అనారోగ్యంతో మరణించారు. అప్పటికి రవిబాబు వయసు ఏడేళ్లే. ఆ తరవాత.. చలపతి మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తండ్రికి పెళ్లి చేయాలని… రవిబాబు నానా ప్రయత్నాలూ చేశాడట. ‘మా నాన్నకు పెళ్లి’ టైపులో సంబంధాలు కూడా తీసుకొచ్చాడట. కానీ అన్నీ క్యాన్సిల్. పిల్లల భవిష్యత్తు కోసం చలపతిబాబాయ్ రెండో పెళ్లి చేసుకోలేదు. అందుకే.. మణిరత్నం తీసిన సఖి, ఈవీవీ సినిమా – మానాన్నకు పెళ్లి రెండు కథలూ నావే అంటూ సరదాగా
చెబుతుంటారు చలపతిరావు.
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపించే చలపతిరావు జీవితంలోనూ విషాద ఘటనలు ఉన్నాయి. ‘సిల్లీఫెలోస్’ సమయంలో ఆయన తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. దాదాపు ఎనిమిది నెలల పాటు చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. కంటి చూపు కూడా కోల్పోవాల్సివచ్చింది. ‘వినయ విధేయ రామ’లో కొన్ని సన్నివేశాల్ని ఆయన చక్రాల కుర్చీపై కూర్చునే నటించేశారు. అలాంటి క్లిష్టమైన సమయంలో బోయపాటి శ్రీను ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహం అంతా ఇంతా కాదని గుర్తు చేసుకుంటుంటారు చలపతి. అన్నట్టు.. చలపతి రావు ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నార్ట. ఓ ఆడియో ఫంక్షన్లో మహిళల్ని ఉద్దేశించి చలపతిరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమరాన్నే రేపాయి. సోషల్ మీడియాలో.. చలపతిని బాగా ట్రోల్ చేశారు. ఆ సమయంలోనే సూసైడ్ నోట్ రాసిపెట్టి, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నార్ట. ఆ ఘటన అంతలా బాధించిందని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని పంచుకున్నారు.