ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి చెందిన సాక్షి దినపత్రికలో.. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఎడిటర్‌గా.. చలపతిరావు అనే తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్‌కు బాధ్యతలు ఇవ్వడానికి అంతా రంగం సిద్ధమయింది. అధికారికంగా చెప్పలేదు కానీ ఇప్పటికీ.. ఈ చలపతిరావునే.. సాక్షి ఏపీ ఎడిషన్ వార్తల్ని ఎడిటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ధనుంజయ్ రెడ్డి అనే మరో జర్నలిస్టు ఈ బాధ్యతల్లో ఉండేవారు. ఎంత కాలం.. అలా చేస్తారని.. అనుకున్నారేమో కానీ.. ఆయనకు ప్రభుత్వంలో మరో కీలక బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. ఒక వేళ అలా కుదరకపోతే.. వైసీపీలో కీలక బాధ్యత అప్పచెబుతారంటున్నారు. ఏదైమైనా ఈ ధనుంజయ్ రెడ్డి ఆంధ్రా జర్నలిస్టు. ఆయనను తొలగించి.. ఏపీ ఎడిషన్‌కు.. తెలంగాణ జర్నలిస్టును పెట్టుకుంటున్నారు.. వైసీపీ పార్టీ పెద్దలు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు స్వర్ణయుగం వచ్చినట్లుగా అయింది. తెలంగాణ ఉద్యమకారుడై.. ఏపీని నానా విధాలుగా కించ పరిచిన దేవులపల్లి అమర్ అనే సీనియర్ జర్నలిస్టుతో ప్రారంభించి.. కొండుభట్ల రామచంద్రమూర్తి నుంచి… అనేక మంది తెలంగాణ సీనియర్లు .. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరపున జీతాలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున సలహాదారులు కూడా.. తెలంగాణ వారే. చిన్నా చితకా ప్రభుత్వం తరపున ఔట్ సోర్సింగ్ పనులు చేస్తున్న వారు కూడా.. తెలంగాణ వారే. అలాంటి వారిని… తెచ్చి పెట్టుకున్నారు కాబట్టి.. ఇక ఎపీ ఎడిటర్‌గా తెచ్చి పెట్టుకోవడం లో వింత లేదనే అభిప్రాయం సాక్షి కాంపౌండ్‌లో వినిపిస్తోంది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే.. సాక్షి మీడియాకు వ్యతిరేక వార్తలు మాత్రమే.. పెద్ద పనిగా ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష ఇమేజ్ను చిన్న బుచ్చడంతో పాటు.. ప్రభుత్వ ఇమేజ్ను పెంచాల్సిన బాధ్యత సాక్షిపై ఉంది. సొంత పత్రికలో.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు తగ్గ కవరేజీ రావట్లేదని… పెద్దలు ఫీలయ్యారేమో కానీ.. ఆ బాధ్యతను.. తెలంగాణ జర్నలిస్టుకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే… ఓవరాల్ ఎడిటర్‌గా ఉన్న వర్ధెల్లి మురళీ కూడా.. పక్కా తెలంగాణ జర్నలిస్టు. మొత్తంగా సాక్షిలో అటు టీవీలోనూ ఇటు పేపర్లలోనూ.. తెలంగాణవారిదే హవా కనిపిస్తోంది.