తెలుగు చిత్రసీమలో `బాబాయ్` పాత్రలకు ప్రసిద్ధి చలపతిరావు. ఆయన కెరీర్… జూనియర్ ఆర్టిస్టు స్థాయి నుంచి ప్రారంభమైంది. ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా ఉంటారాయన. తొలిరోజుల్లో చలపతిరావుని ఎన్టీఆర్ బాగా ప్రోత్సహించారు. తన ప్రతీ సినిమాలోనూ.. చలపతిరావుకి అవకాశం ఇచ్చేవారు. చిన్నదో.. పెద్దదో.. ఎన్టీఆర్ సినిమా అంటే.. చలపతిరావుకి ఓ పాత్ర తప్పకుండా ఉండేది. దానవీర శూరకర్ణలో అయితే.. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తే…. చలపతిరావు ఏకంగా 5 పాత్రలు చేశారు. అన్నీ జూనియర్ ఆర్టిస్టు స్థాయివే.
దానవీరశూర కర్ణ షూటింగ్ సమయంలో.. సెట్ కి రమ్మని చలపతిరావుకి ఎన్టీఆర్ కబురంపారట. చలపతి రాగానే… `ఈ సినిమాలో జరాసంధుడి పాత్ర చేయాలి… మేకప్ వేసుకొని రా` అన్నార్ట. `ఇందులో నేను ఇప్పటికే నాలుగు పాత్రలు చేశా అన్నగారూ..` అని చలపతి అంటే.. `పిచ్చివాడా… ఎన్టీఆర్ ఎవరో.. పల్లెటూర్లలో చాలామందికి తెలీదు. నిన్నెవరు గుర్తు పడతారు` అని చెప్పి ఆ పాత్ర చేయించార్ట. ఈ విషయాన్ని చలపతిరావు చాలా సందర్భాల్లో గుర్తు చేసుకొంటారు. ఎలగైతేనేం.. దానవీరశూర కర్ణలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రల్లో కనిపించిన ఘనత మాత్రం చలపతిరావు దక్కించుకొన్నారు.