కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో చనిపోయారు. చాలా రోజులుగా ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై ఉన్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కర్నూలు జిల్లా సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. ఫ్యాక్షన్ లీడర్‌గా గుర్తింపు పొందారు. కోవెలకుంట్ల నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన హవా తగ్గింది. బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడటంతో ఆయనకు పరాజయాలు ఎదురయ్యాయి. అవుకు మండలంలో ఆయనకు పట్టు ఉండటంతో బనగానపల్లె నియోజకవర్గంలో ఎవరికి మద్దతు ఇస్తే వారు గెలుస్తూ వస్తున్నారు.
మొదటినుంచి కాంగ్రెస్‌లో ఉన్న ఆయన… వైఎస్ మరణం అనంతర పరిస్థితుల్లో 2014లో టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డికి మద్దతిచ్చారు. ఆయన గెలిచారు. అయితే… ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్న కోపంతో.. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఈ సారి బనగానపల్లెలో వైసీపీ తరపున కాటసాని రామిరెడ్డి గెలిచారు. ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సీనియర్ ఫ్యాక్షన్ లీడర్ అయిన చల్లాకు ఇప్పటికీ… కొన్ని గ్రామాల్లో మంచి పట్టు ఉంది.
ఇటీవల కరోనా సోకడంతో… బాగా ఇబ్బంది పడ్డారు. చనిపోయేవరకూ ఆయనకు కరోనా సోకిందని బయటకు రాలేదు. కరోనా సోకి చనిపోయిన ప్రజా ప్రతినిధుల్లో.. చల్లా రామకృష్ణారెడ్డి రెండో వారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అలా చనిపోయారు. ఇప్పుడు… ఎమ్మెల్సీ చనిపోయారు. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులకు కరోనా సోకినా… కోలుకున్నారు. కొంత మంది మాత్రం.. తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.