ఈ దసరాకు రెండు శిఖరాలు ఢీ కొట్టబోతున్నాయి. జై లవకుశ కాస్త ముందే వచ్చేస్తుంటే, సరిగ్గా దసరా సరదాల్ని మోసుకొంటూ స్పైడర్ వస్తున్నాడు. రెండూ అభిమానుల అండ ఉన్న చిత్రాలే. కాకపోతే అటు ఎన్టీఆర్‌కీ, ఇటు మహేష్ సత్తాకు అసలు సిసలు పరీక్షా సమయంగా మారిపోయింది… ఈ దసరా. ఎన్టీఆర్, మహేష్ సినిమాలనగానే ఎగబడే పరిస్థితి ఇప్పుడు లేదు. అటు బయ్యర్లు, ఇటు ప్రేక్షకులు ఇద్దరూ ఆరితేరిపోయారు. లోటుపాట్లేంటో ఆలోచించి మరీ సినిమా కొంటున్నారు. అది టికెట్ అయినా, ఏరియా అయినా. ఏమాటకామాట చెప్పుకోవాలంటే ఈ రెండు సినిమాల్లో దేన్నీ ‘షూర్ షాట్ గా హిట్ కొడుతుంది’ అన్నంత నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ట్రేడ్ వర్గాల్లో కాకలు తీరినవాళ్లు, పోస్టర్ చూసి సినిమా జాతకం, సాధించబోయే వసూళ్లు లెక్కగట్టే వాళ్లు సైతం.. ఈ రెండు సినిమాల విషయంలో.. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ మధ్యస్తంగా మాట్లాడుతున్నారు. ఎన్నో నమ్మకాలు, అంతలోనే అంతులేని అనుమానాలు.. అలా స్పైడర్, లవకుశల్లో దేనికీ ధైర్యంగా జై కొట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి.
మురుగదాస్ సినిమా అంటే లొట్టలేసుకొని వెళ్లిపోయే సినీ ప్రేమికులు కూడా ‘ఈసారి ఏదో తేడా కొడుతున్న వాసన’ వస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తున్నారు. సినిమా లేటైంది. కాదనడం లేదు. కాకపోతే లేటైన ప్రతీ సినిమా పేలిపోయినట్టు కాదు కదా? ప్రచార చిత్రాలు, పాటలు ఏమంత ఇంపుగా అనిపించలేదు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. కానీ మురుగదాస్ టాలెంట్‌ని తక్కువ అంచనా వేస్తే ఎలా..?? స్టాలిన్ తప్ప ఫ్లాపు ఎరగడు. ఆ సినిమాలో కూడా పాయింట్ బాగుంటుంది. చిరంజీవి ఇమేజ్ చుట్టూ అల్లుకు తీరాల్సిన సన్నివేశాలు, మసాలాలూ ఎక్కువవ్వడంతో పాయింట్ కాస్త గాలికి ఎగిరిపోయింది. తమిళ, హిందీ నాట సూపర్ హిట్లు కొట్టిన మురుగదాస్ చెత్త సినిమా ఏం తీయడు. ఆ విషయంలో ఎలాంటి డౌటూ లేదు. కాకపోతే.. సినిమాలో తమిళ వాసన ఎక్కువైందని, తెలిసిన కథే అని, సినిమా చుట్టేశారని, రీషూట్లు అయ్యాయని రకరకాల టాక్‌లు రావడంతో.. ఈసినిమాపై ఫోకస్ బాగా తగ్గిపోయింది.
లవకుశది మరో కథ. ఎన్టీఆర్ స్టామినాపై, అతని పెర్ఫార్మ్సెన్స్పై ఎవరికీ అనుమానాల్లేవు. కానీ బాబి ఎలా నెట్టుకొచ్చాడన్నదే డౌటు. బాబిని పక్కన పెట్టి ఎన్టీఆర్, చోటాలు దర్శకత్వ ప్రతిభ చూపించుకొన్నారని తెలియడంతో.. ఈ సినిమా రిజల్ట్‌పై కాస్త కంగారు పుట్టుకొచ్చిందన్నది వాస్తవం. దర్శకుడ్ని పక్కన పెట్టిన ఏ ప్రాజెక్టు హిట్ కొట్టిన దాఖలాలు లేవు. పైపెచ్చు.. ఇందులో ముగ్గురు ఎన్టీఆర్‌లు ఉన్నా.. సినిమా అంతా జై పాత్ర చుట్టూనే తిరుగుతుందన్న ప్రచారం బాగా ఎక్కువైంది. కోన వెంకట్ పెన్ను పదును తగ్గి చాలాకాలమైంది. ఆయన ముట్టుకొన్న సినిమా ఫట్టుమంటున్న తరుణంలో లవకుశపై అనుమానాలకు ఊతం వస్తోంది.
దసరా సీజన్, పైగా పెద్ద సినిమాలు కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్‌కి ఢోకా లేకపోవొచ్చు. టాక్ అటూ ఇటుగా ఉంటే పరిస్థితేంటన్నదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. అక్కడే స్టార్ డమ్, స్టామినాలు అక్కరకు వస్తాయి. కాస్త నెగిటీవ్ టాక్ ఉన్న తరుణంలోనూ.. థియేటర్లకు జనాల్ని రప్పించుకోగలిగే దమ్ము ఎవరికి ఉందన్న ప్రశ్న పుట్టుకొస్తోంది. ఈ సినిమా వసూళ్ల మధ్య కూడా పోటీ ఏర్పడే పరిస్థితులున్నాయి. నైజాం, ఓవర్సీస్లో ఎవరెక్కువ దమ్ము చూపిస్తారు, ఎవరి సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి? ఇవి ప్రశ్నలు కావు. సగటు ప్రేక్షకుడి బెట్టింగ్ ఆయుధాలు. ఎన్టీఆర్, మహేష్ సినిమాల్లో ఏది హిట్టు, ఏది ఫట్టు అనే విషయంలోనూ బెట్టింగులు జోరందుకొంటున్నాయి. మరి ఎవరి రాతలు తలకిందులవుతాయో, ఎవరి అంచనాలు తారుమారు అవుతాయో తేలాలంటే… ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలి.