మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేపనిలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిమగ్నమై ఉన్నారు. దీన్లో భాగంగా పార్టీ జనరల్ సెక్రటరీలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా చేజారకూడదని సెక్రటరీలకు చెప్పారు. ఈ సందర్భంలో కూడా భాజపాని తక్కువ అంచనా వెయ్యొద్దనీ, కాంగ్రెస్ పార్టీని ఈజీగా తీసుకోవద్దని పార్టీ నేతలకు చెప్పారు. ఆ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయనీ, లోక్ సభ ఎన్నికల్లో లోపయికారీ ఒప్పందం కుదుర్చుకుని తెరాసను ఓడించే ప్రయత్నం చేశాయన్నారు. పార్టీకి ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు భాజపా, కాంగ్రెస్ లు మున్సిపల్ ఎన్నికల్లో కూడా చేతులు కలుపుతూ కుట్రకు సిద్ధమౌతున్నాయని కేటీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ కుట్రను గుర్తించలేకపోయామనీ, అందుకే ఏడు స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
లోక్ సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ లు కలిసి పనిచేశాయా..? ఏమో, ఈ కోణంలో ఎక్కడా విశ్లేషణలు జరగలేదు! భాజపా కాంగ్రెస్ లు ఒకటై కుట్ర చేస్తున్నాయనే అంశాన్ని పార్టీ కేడర్లో సమర స్ఫూర్తిని నింపేందుకు కేటీఆర్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతే! అయితే, ఇదే సమావేశంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటల గురించి ప్రస్థావనకు వచ్చింది. జిల్లాల్లో కొంతమంది నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉందనీ, వానికి కట్టడి చేయడం ఎలా అంటూ కేటీఆర్ తో కొంతమంది నేతలు ప్రస్థావించినట్టు సమాచారం. మేం చెబితే వినే పరిస్థితుల్లో నాయకులు లేరని కొందరు సెక్రటరీలు చెప్పారు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి, ఆ తరువాత నేనూ మాట్లాడతాను, అప్పటికీ మారకపోతే పార్టీకి అధినాయకత్వం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తుందని ఓరకమైన హెచ్చరికగానే చెప్పారు. ఇంకోటి… పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను మీడియా ముందు ప్రస్థావించొద్దంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
జిల్లాల్లో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలున్నాయని మరోసారి తెరమీదికి వచ్చింది. రెండో దఫా గెలిచిన ఎమ్మెల్యేల తీరుపై కొన్ని విమర్శలు మొదట్నుంచీ ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు కుమ్మక్కయితే తెరాస స్థానాలు కోల్పోలేదు, రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచేశాం కదా అనే ధీమాతో కొంతమంది ఎమ్మెల్యేలే లోక్ సభ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోలేదు. అంతర్గత కుమ్ములాటలకు కారణం అక్కడుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ కుమ్ములాటల్ని కట్టడి చేయాల్సిన సవాల్ ఇప్పుడు కేటీఆర్ ముందుంది. లోక్ సభ ఎన్నికలప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడూ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీదే అని ఇప్పటికే ఓసారి నాయకులకు చెప్పేశారు. ఇప్పుడు వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం కేటీఆర్ చెయ్యాల్సి ఉంటుంది.