తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. మరో సవాల్ ఎదురు రావడం ఖాయమైపోయింది. తాను నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించడంతో… హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ్నుంచి… కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం.. అంత తేలిక కాదు. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎంపీగా పోటీ చేయడం అసలు ఇష్టం లేదు. రాహుల్ గాంధీ చెప్పి పంపించడంతో.. తప్పనిసరిగా పోటీ చేయాల్సి వచ్చింది. గెలుస్తానని ఆయన అనుకోలేదు. కానీ.. ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడు, నాలుగు వేల ఓట్ల తేడాతో బయటపడిన ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం హుజూర్ నగర్ ప్రజలు పట్టం కట్టారు. దాదాపుగా పదిహేను వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు.
మరో ఆరు నెలల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమవుతోంది. అక్కడ ఆయన తన భార్య ఉత్తమ్ పద్మావతికి టిక్కెట్ ఇప్పించుకోవడం ఖాయమే. పద్మావతి.. గత ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అంతకు ముందు ఆమె కోదాడకు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు అనూహ్యంగా మరోసారి… ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించబోతోంది. అయితే.. అధికార పార్టీని ఎదుర్కొని.. అక్కడ విజయం సాధించడం అంత సులువు కాదు. గత ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి అనే ఎన్నారై.. ఉత్తమ్‌కు గట్టి పోటీ ఇచ్చారు. మూడు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. హుజూర్ నగర్‌కు ఉపఎన్నిక రావడం … సైదిరెడ్డికి కూడా ఆనందాన్నిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి.. ఆయన వచ్చే ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. అనూహ్యంగా ఏడాదిలోపే.. పోటీకి అవకాశం వస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదు కాబట్టి.. ఆ తర్వాత.. ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్‌గా తొలగిస్తారని ప్రచారం జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సీట్లు రావడం.. టీ పీసీసీకి ఘన విజయంగా మారింది. ఇప్పుడు కూడా పీసీసీ మార్పు గురించి ఆలోచిస్తున్నారు కానీ… అంత వేగంగా కాదు.. కొంత నెమ్మది అయ్యే అవకాశాలు ఉన్నాయి. బహుశా.. హుజూర్ నగర్ ఉపఎన్నిక తర్వాత.. ఆ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. ఆరునెలలకో సవాల్ ఎదురొస్తోంది.