ఊహించినట్లే మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యారు. ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో ఆస్థానంలో గంబీర్ ని ఎంపిక చేసింది బీసీసీఐ. గంబీర్ హెడ్ కోచ్ అవతారం ఎత్తడంతో టీంఇండియాకి మరో స్టార్ట్ ఎట్రాక్షన్ చేరినట్లయింది. ఎందుకంటే.. గంబీర్ ట్రాక్ రికార్డ్ మామూలుది కాదు. తను టీమ్ఇండియా తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో గంబీర్ సభ్యుడు. ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో గంభీరే టాప్‌స్కోరర్. ఐపీఎల్లో కెప్టెన్‌గా 2012, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లను అందించాడు. 2024లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్‌కతాకు మెంటర్‌గా గంభీర్ తన కోచింగ్ ఎబిలిటీని నిరూపించుకున్నాడు.
జులై 27న మొదలయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్ ప్రయాణం ఆరంభమవుతుంది. ప్రస్తుతం టీంఇండియా వున్న ఫాంకి ఇది నామామాత్రపు టూర్ అనే చెప్పాలి. గంబీర్ ముందు వున్న అసలు లక్ష్యాలు వేరుగా వున్నాయి. 2027 వరకూ తను కోచ్ గా వుండే అవకాశం వుంది. ఈ కాల వ్యవధిలో ఐదు వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీలు వున్నాయి. ఛాంపియన్ ట్రోపీ 2025, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025, టీ20 వరల్డ్ కప్ 2026, వన్డే వరల్డ్ కప్ 2027, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2027. ఈ ఐదు టైటిల్స్ కి గురి పెట్టడం గంబీర్ ముందు వున్న అసలు లక్ష్యం.
గంబీర్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలిచి వరల్డ్ ఛాంపియన్ గా వుంది. జట్టుని ఫామ్ లోకి తీసుకురావడం తన లక్ష్యంలో లేదు. కానీ అంతకంటే పెద్ద పని వుంది. విరాట్, రోహిత్, జడేజా ఇంక ఎంతకాలం ఆడుతారో తెలీదు. ఇప్పటికే టీ20లకి గుడ్ బై చెప్పారు. రాబోయే వన్డే వరల్డ్ కప్ కి కూడా అందులోవుండే అవకాశం కనిపించడం లేదు. ఈ ముగ్గురు కూడా గొప్ప అనుభవం, స్కిల్ వున్న ఆటగాళ్ళు. ఆలాంటి ముగ్గురు ఆటగాళ్ళని మైమరపించే ఆటగాళ్ళు ఇండియాకి కావాలి. ఈ విషయంలో హెడ్ కోచ్ గా గంబీర్ చాలా కసరత్తు చేయాలి. టీంమిండియాలో ప్రతిభకి కొరత లేదు. అయితే ఆ ప్రతిభని ఎంపిక చేసుకొని, సానబెట్టి వరల్డ్ క్లాస్ ఆటగాళ్ళగా మార్చే భాద్యత ఇప్పుడు గంబీర్ పై వుంది.