నిన్నా మొన్నటి వరకూ రాజకీయాలు, పార్టీలు, సీట్లు, ఓట్లు గురించి మాట్లాడుకున్నవాళ్లందరికీ కాస్త రిలీఫ్ దొరకబోతోంది. టాపిక్కులు రాజకీయాల నుంచి క్రికెట్‌కు షిఫ్ట్ అవ్వబోతున్నాయి. ప్రపంచ కప్ సమరం మొదలైపోతోంది కదా.. అందుకు. ఈ రోజు నుంచే ఈ విశ్వ క్రీడా సంరంభం ప్రారంభం కాబోతోంది. ప్రతీరోజూ ఓ మ్యాచ్! ఇక క్రికెట్ ప్రేమికులకు పండగే. ఎప్పటిలా… ఈ టోర్నీలో భారత్ కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. మరి.. ఈసారి టీమ్ ఇండియాకు గెలుపు అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి? మిగిలిన బలమైన జట్లకు మనం ఎంత వరకూ పోటీ ఇవ్వగలం??
ఇప్పటికి రెండు సార్లు భారత్ విశ్వ విజేతగా నిలిచింది. మూడోసారి కప్పు కొట్టే అవకాశాలు భారత్‌కు ఉన్నాయి కూడా. ప్రపంచంలో ఏ జట్టుకీ లేనంత బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్ సొంతం. మూడుసార్లు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్ ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కితాబులు అందుకుంటున్న విరాట్ కోహ్లి ఉన్నాడు. ఇక ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా స్థానం సంపాదించిన ధోని ఉన్నాడు, ప్రస్తుత ఫామ్‌ని బట్టి చూస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అనదగ్గ బుమ్రా ఉన్నాడు. ఆల్ రౌండర్‌గా ఎప్పుడైనా సరే, మ్యాచ్‌ని మలుపుతిప్పగల హార్థిక్ పాండ్యా మన జట్టులోనే ఉన్నాడు. ఇలాంటి జట్టు హాట్ ఫేవరెట్ కాకుండా ఎలా ఉంటుంది?
కాకపోతే… ఎవరు ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని సందిగ్థత ఇప్పటకీ కొనసాగుతూనే ఉంది. రోహిత్, ధావన్‌ల జంట ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. `ఆడితే ఆడతారు.. లేదంటే లేదు` అన్నట్టుంది వీళ్ల పరిస్థితి. కీలకమైన నాలుగో స్థానం ఇంకా కుదురుకోలేదు. నాలుగో స్థానం విషయంలో టీమ్ ఇండియా చాలా ప్రయోగాలు చేసింది. కానీ.. సరైన ఫలితాలు రాలేదు. ఇప్పటికైతే ఆ స్థానం కె.ఎల్ రాహుల్‌దే. బుమ్రా సంగతి సరే. కానీ భువి ఫామ్‌లో లేడు. కీలకమైన మధ్య ఓవర్లలో భువనేశ్వర్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. మీడియం ఫేస్ వేసే హార్థిక్ పాండ్యా బంతుల్లో ఉండే వేగం కూడా భువి బౌలింగ్‌లో ఉండడం లేదు. స్వదేశంలో బంతికి గిర గిర తిప్పేసే చాహల్, కులదీప్ పప్పులు ఇంగ్లండ్‌లో ఉడికే అవకాశమే లేదు. బయటి పిచ్‌లపై వీళ్ల ప్రభావం అంతంత మాత్రమే అని తేలిపోయింది. ఓపెనర్లు వీలైనంత త్వరగా కుదురుకోవాలి. లేదంటే… ఆ భారం టాప్ ఆర్డర్‌పై పడుతుంది. ఇంగ్లండ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం 300 పరుగులైనా చేయాలి. ఎందుకంటే అక్కడి పిచ్‌లు చాలా చిన్నవి. ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించడం సులభంగా కనిపిస్తోంది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలన్నా, కొండంత టార్గెట్‌ని కొట్టాలన్నా.. ఓపెనర్లు రాణించాల్సిందే. ఫేస్‌ని ఎదుర్కోవడంలో మన బ్యాట్స్మెన్లు ఎంత ఇబ్బంది పడతారో… న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ తేల్చేసింది. బంగ్లాపై మనోళ్లు విరుచుకుపడి ఆడారు గానీ.. సరైన పేస్ దళం తగిలితే… తట్టుకోవడం కష్టమే. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలాంటి మేటి జట్లు భీకరమైన ఫామ్‌లో ఉన్నాయి. వాటితో సమానంగా రాణించాలంటే, ఈసారి కప్పు వేటలో చివరి వరకూ నిలబడాలంటే మన బలాలకు పదును పెట్టి, బలహీనతల్ని అధిగమించాల్సిందే.