ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతల తీరు తాము బురద చల్లుతాం.. మీరు తుడుచుకోవాల్సిందేనన్నట్లుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలందరూ.. చంద్రబాబు తప్పు చేయకపోతే విచారణకు హాజరవ్వాలని … వాదించేస్తున్నారు. అసలు బాధితులే ఫిర్యాదు చేయకుండా… వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు పెట్టారు. ఇక్కడ రాజకీయ కక్ష చాలా స్పష్టంగా కనిపిస్తున్న సమయంలో.. న్యాయస్థానాల్లో నిలువదని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్న సమయంలో… న్యాయం కోసం కోర్టుకెళ్లకుండా.. టీడీపీ నేతలపై ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ను వైసీపీ నేతలు ప్రారంభించారు. తాము కేసులు పెడతాం.. విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నట్లుగా మాట్లాడేస్తున్నారు.
ఓ వైపు వైసీపీ నేతలతో పాటు… ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారుల తీరు కూడా వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఏకంగా మాజీ సీఎం చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేసిన అధికారులు ఇప్పుడు… తాను చేసిన ఫిర్యాదుకు ఆధారాలివ్వాలని ఆళ్లకు నోటీసులు పంపారు. ఆళ్ల చెప్పిన దాని ప్రకారం.. మూడు గ్రామాలకు చెందిన దళిత రైతులు తన వద్దకు వచ్చి .. తమ భూములు లాక్కున్నారని కన్నీరు పెట్టుకున్నారు. దానికి ఆయన ఆవేదన చెంది ఆర్టీఐ చట్టం ద్వారా పదహారు వందల పేజీల సమాచారాన్ని సేకరించి… సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సహజంగా అయితే ఇక్కడ చేయాల్సింది.. నేరుగా బాధితులతో ఫిర్యాదు చేయించడం. అప్పుడే ఆ కేసుకు విలువ ఉండేది. కానీ ఆ బాధితులెవరో చెప్పకుండా… వారెలా నష్టపోయారో వివరించకుండా కేసులు నమోదు చేశారు.
బాధితులు ఎవరు.. ? వారిని ఎవరు ఏ విధంగా మోసం చేశారు..? దానికి చంద్రబాబు ఎలా బాధ్యుడయ్యారు..? ఎవరూ ఫిర్యాదు చేయకుండా …ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని ఎలా కేసు నమోదు చేస్తారు..? . ఇలాంటివన్నీ న్యాయస్థానంలో ప్రాథమికంగా విచారణకు వస్తాయి. వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటినీ న్యాయనిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ… వైసీపీ నేతలు.. తమ అనుకూల మీడియాతో… ఒకే రకమైన వాదనను వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసైన్డ్ ల్యాండ్ ఎవరో కొన్నారని… కొన్న వాళ్ల పేర్లుతో సహా బయట పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆ కొనుగోళ్లు అక్రమం అయితే ప్రభుత్వం ఈ పాటికి స్వాధీనం చేసుకుని ఉండేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో… వైసీపీ సర్కార్… కొన్ని వేల ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది. అలా చేసుకున్నప్పుడు అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు … కోర్టులు స్టే ఇస్తే.. కోర్టులపై నిందలేసి వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ప్రచారం చేసుకోవడానికైనా ఉపయోగపడుతుందన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ రాజకీయకక్ష సాధింపుల కేసులు చాలా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతాయని టీడీపీ నేతలు అంటున్నారు.