చిరంజీవి 150వ చిత్రానికి రంగం సిద్ధమైంది. 29న ఈ సినిమాకి క్లాప్ కొట్టేస్తారు. వచ్చే నెలలో సెట్స్‌పైకీ తీసుకెళ్తారు. అంతా బాగానేఉంది. కాకపోతే.. చిరు ముందు ఇప్పుడు పెను సవాళ్లున్నాయి. వాటిని దాటుకొంటూ అభిమానుల్ని ఎలా అలరిస్తాడా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. చిరంజీవి గొప్ప డాన్సర్. టాలీవుడ్లోనే కాదు సౌతిండియాలోనూ చిరు ఈ విషయంలో తనకంటూ ఓ ప్రత్యేకత సృష్టించుకొన్నాడు. అలాంటి చిరు ఇది వరకటిలా డాన్స్ చేయగలడా?? ఇది వరకటి ఈజ్ చూపించగలడా అన్నది ప్రధాన ప్రశ్న. బరువు తగ్గించుకొనే ప్రయత్నంలో నెలల తరబడి సాధన చేస్తున్నా… చిరు తగ్గిందేమీ లేదు. పైగా మొహంలో వయసు మీద పడిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్నుంచి ఎలా బయపడగలడు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నింటికి మించి కత్తి సబ్జెక్ట్ చిరుకి సరిపోతుందా?? విజయ్ కీ చిరుకీ వయసు రీత్యా ఇమేజ్ రీత్యా చాలా వ్యత్యాసం ఉంది. మరి.. విజయ్‌కి సూటైన కథ… చిరుకి ఎలా నప్పుతుంది??
కథానాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు. సమంత, తమన్నా, రకుల్లాంటి కుర్ర హీరోయిన్లతో డాన్సులేసే వయసు కాదు చిరంజీవిది. నయనతార అనుష్కలు అందుబాటలో లేరు. ఈ దశలో చిరు పక్కన కథానాయికని వెదికిపట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. నవతరం హీరోలు జోరుమీదున్నారు. వంద కోట్ల సినిమాలతో ప్రభంజనాలు సృష్టిస్తున్నారు. వాళ్లకు చిరు ఇప్పుడు చెక్ పెట్టగలడా?? ఇలా చిరు 150 సినిమా చుట్టూ ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు పరచుకొన్నాయి. బాక్సాఫీసు ని సవాల్ చేసే సత్తా ఇంకా చిరంజీవికి ఉందని ఆయన వీరాభిమానులు నమ్ముతున్నారు. ఆ నమ్మకం నిజమవ్వాలని కోరుకొందాం.. ఆల్ ద బెస్ట్ చిరు!