లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ కాక పుట్టిస్తున్నారు. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ వరుసగా సవాళ్ళు విసురుతుండటంతో రాష్ట్రంలో సవాళ్ళ రాజకీయం రంజుగా కొనసాగుతోంది.
పంద్రాగస్టు లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రామయ్య సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై స్పందించిన హారీష్ రావు తమకు రేవంత్ హామీపై నమ్మకం లేదన్నారు. రేవంత్ ప్రకటించిన డెడ్ లైన్ లోపు రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. దీంతో చెప్పినట్లుగానే పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా..? అని రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సవాల్ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎనిమిది సీట్లు వస్తాయని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని..ఆ పార్టీ రెండు సీట్లు గెలిచినా తను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఛాలెంజ్ లు విసురుతూ కాంగ్రెస్ ను కార్నర్ చేయాలనుకున్న బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టగా…బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహంతోనే కారుకు కాంగ్రెస్ నేతలు ఫుల్ స్టాప్ పెడుతున్నారు.