పాకిస్తాన్ పై జాలి చూపిస్తే ఆ దేశానికి వెళ్లిపోవాలని పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలకు కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..పవన్ కల్యాణ్ విమర్శలకు సమాధానం చెప్పకుండా బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టి ..కౌంటర్ ఇచ్చానని అనిపించేలా విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఇది సినిమా కాదు.. స్క్రిప్టు చదవడానికని చెప్పుకొచ్చారు. రాజకీయాలు బంద్ చేశి, కంగనా రనౌత్లా వెళ్లి మోదీకి సపోర్టుగా సినిమాలు చేస్కోవాలని సలహా ఇచ్చారు.
అసలు పవన్ కల్యాణ్ చేసిన విమర్శలంటి.. ఎంపీ చామల ఇచ్చిన కౌంటర్ ఏంటి చూస్తే అసలు సంబంధం లేదు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ పై సానుభూతి చూపించేలా మాట్లాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సిద్ధరామయ్య కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలు అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు మతం అడగలేదని .. వితండవాదం చేశారు. ఇలాంటివి ఎక్కువ కావడం.. దేశ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. కాంగ్రెస్ పార్టీ.. అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలేనని పార్టీకి సంబంధం లేదని ప్రకటించుకుంది. ఇందులో అవాస్తవం ఏమీ లేదు.
సొంత పార్టీ కూడా తమ పార్టీ నేతల మాటల్ని తనకు అంటుకోకుండా చూసుకుంటే.. పవన్ కల్యాణ్ అన్న మాటలకు మాత్రం కాంగ్రెస్ నేతలకు రోషం ముంచుకొచ్చిందన్న విమర్శలు జనసైనికుల నుంచి వస్తున్నాయి. దేశం ఇప్పుడు ఓ భావోద్వేగ పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో తప్పుడు వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయంగా నష్టపోయేది.. కాంగ్రెస్ పార్టీనే. దాన్ని తెలుసుకోకుండా పవన్ పై విమర్శలు చేస్తే ఏం వస్తుంది ?