ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 252 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్లై ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. శుభమన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. అయితే ఆ తర్వాత స్పీడ్ బ్రేకర్లు ఎదురయ్యాయి. కోహ్లీ ఒక్క పరుగుకే ఎల్బీడబ్యూ అయ్యాడు. ఆ తర్వాత 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. 122 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినట్లయింది. తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్ ఆవేశపడకుండా నిలకడగా ఆడారు. స్కోరును 180 దాటించిన తర్వాత ఇద్దరూ షాట్లకు ప్రయత్నించడంతో కొద్ది తేడాతో పెవిలియన్ చేరారు. కానీ విజయం ముంగిటకు టీమిండియాను చేర్చారు.
కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా తర్వాత కివీస్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. విజయానికి కావాల్సిన పరుగులు వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. విజయానికి 15 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన సమయంలో హార్ధిక్ పాండ్యా.. భుజాల వరకూ వచ్చిన బంతిని బుక్ చేయబోయాడు కానీ వర్కవుట్ల్ కాలేదు. గాల్లోకి ఎగరడంతో బౌలర్ జామిసన్ పట్టుకున్నాడు.దాంతో ఆరో వికెట్ పడింది. తర్వాత క్రీజన్ లోకి జడేజా వచ్చాడు. కంగారు పడకుండా..రాహుల్ తో కలిసి మిగిలిన పరుగులు పూర్తి చేశాడు.
ఛేజింగ్ లో టీమిండియా ఎక్కడా తడబడలేదు కానీ.. ఫైనల్ మ్యాచ్ కావడంతో కొన్ని కోట్ల ఒత్తిడికి గురవుతారేమోనన్న ఆందోళన కనిపించింది. కానీ అలాంటిదేమీ లేకుండా.. విజయం దిశగా సాఫీగా సాగిపోయారు. అంతకు ముందు టాస్ గెల్చినా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు.. శుభారంభం లభించినా.. ఆ టెంపోను కొనసాగించలేకపోయింది. భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. కొన్ని సింపుల్ క్యాచ్‌లు వదిలేశారు. అయినా కివీస్ ప్లేయర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. డారిల్ మిచెల్, బ్రాస్ వెల్ అర్థసెంచరీలు చేయడంతో… స్కోరు 250 దాటింది. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు. సెమీ పైనల్లో సెంచరీలు చేసిన రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ పెద్దగా రాణించలేకపోయారు.
భారత్ మూడో సారి చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిధ్యం ఇచ్చింది. కానీ భారత్ ఆ దేశానికి వెళ్లి ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో భారత్ మ్యాచ్‌లను దుబాయ్ లో నిర్వహించారు. పాకిస్తాన్ గ్రూప్ దశ నుంచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.