Chanakya Review
తెలుగు360 రేటింగ్: 2/5
‘ఎక్స్పెక్ట్ అన్ ఎక్సెప్టెడ్’
– చాణక్యలో ప్రతినాయకుడి స్లోగన్ ఇది.
అంటే.. అతని ఎత్తులు ఊహకు అందనంత భయంకరంగా ఉంటాయన్నమాట.
అలాంటి ప్రతినాయకుడు ఎదురైనప్పుడే కథానాయకుడి బలం తెలుస్తుంది. పాకిస్థాన్‌లో ఉండే ఓ ఉగ్రవాది, ఆ దేశం అందించే అండదండలు, సహాయ సహకారాలు చూసి రెచ్చిపోతూ – భారతదేశంతో ఓ ఆట ఆడుకోవాలని చూస్తాడు. అలాంటివాడితో.. పోరుకి దిగాలనుకున్న కథానాయకుడి తెలివితేటలు, వేసే ఎత్తులు ఇంకెంత గొప్పగా ఉండాలి? ఈ విషయంలో తను చాణిక్యుడిని మించిపోవాలి. అందుకే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు. కేవలం ఈ తెలివితేటలు డైలాగులకూ, టైటిళ్లకు పరిమితం చేస్తూ, గూఢచర్యాన్ని కామెడీ చేస్తూ.. `రా` చేసే విన్యాసాల్నీ, సాహసాల్నీ – లాజిక్కులకు అందకుండా చూపిస్తూ.. రెండున్నర గంటల నీరసాన్ని కమర్షియల్ సినిమాగా మలచిన ప్రయత్నం ఈ `చాణక్య`.
టీజర్లూ, ట్రైలర్లూ చూస్తే కథ అర్థమైపోతుంది. హీరో ఓ `రా` అధికారి. బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ.. అవసరమైనప్పుడు ఉగ్రవాదులతో `ఫుట్‌బాల్` మ్యాచ్ ఆడేసుకుంటుంటాడు. పాకిస్థాన్‌లో ఉండే సోహైల్… ఆ ప్రభుత్వ అండదండలు చూసుకుంటూ, ఇండియాపై దాడులకు ఎగబడతాడు. సోహైల్ ప్రధాన అనుచరుడిని అర్జున్ టీమ్ మట్టుపెడుతుంది. దాంతో.. సోహైల్ అర్జున్ అండ్ టీమ్‌పై పగ పెంచుకుంటాడు. అర్జున్ స్నేహితులు, సహచరులైన నలుగురిని కిడ్నాప్ చేసి, కరాచీలో బంధిస్తాడు. అక్కడి నుంచి వాళ్లని అర్జున్ ఎలా విడిపించాడన్నది కథ.
యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు కథ పెద్దగా అవసరం లేదు. అయితే ఆ కథలో మలుపులు మాత్రం చాలా కావాలి. ప్రతీ సన్నివేశం ఉత్కంఠభరితంగా తెరకెక్కించాలి. తరవాత ఏం జరుగుతుంది? అంటూ ఊపిరి బిగబెట్టి చూడాలి. అందుకు ఆస్కారం ఉన్న కథే ఇది. కాకపోతే… కథానాయకుడి తెలివితేటలు చూపించాలంటే… వాటిని రుజువు చేసే బలమైన సన్నివేశాలు పడాలి. అది లేకపోతే `చాణిక్య` అనే టైటిల్‌కి జస్టిఫికేషన్ కూడా జరగదు. అలాంటి ప్రయత్నాలు ఒకట్రెండు జరిగాయి కూడా. కాకపోతే అవి ఏమాత్రం సరిపోలేదు. కథానాయకుడ్ని `రా` అధికారిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సన్నివేశం ఓకే అనిపిస్తుంది.
ఆ తరవాత… టెంపో మరింత పెరగాలి. కానీ.. బ్యాంకు నేపథ్యంలో తెరకెక్కించిన సిల్లీ కామెడీ వల్ల గ్రాఫ్ అమాంతం పడిపోతుంది. అలీని ప్రవేశపెట్టి, శునక సంభోగానికి సంబంధించిన డైలాగులు చెప్పించడంతో.. ఇక ఆ గ్రాఫ్ మళ్లీ పైకి లేచే అవకాశం లేకుండా చేశాడు. రెండు కుక్కల కలయికల కోసం కథానాయిక పడే తాపత్రయం చూస్తే – కామెడీ కోసం దర్శకుడికి ఇంతకు మించిన మార్గం దొరకలేదా? అనిపిస్తుంది. ఆయా సన్నివేశాలు ఈ సినిమాపై ఆసక్తికి క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తే.. పాటలు ఇక్కడి నుంచి `పారిపోతే బాగుణ్ణు` అనే కోరిక రగిలిస్తాయి. విశ్రాంతి ఘట్టానికి ముందు.. కథ కాస్త తెరిపిన పడుతుంది. ద్వితీయార్థంలో కథానాయకుడి సాగించే సాహస యాత్ర – ఈ సినిమాకి మూలం. బహుశా గోపీచంద్ కూడా ద్వితీయార్థంపై నమ్మకంతోనే ఈ సినిమా ఒప్పుకుని ఉంటాడు. కరాచీలో కథానాయకుడు సాగించే ఆపరేషన్ సక్సెస్ అయితే… `చాణక్య` గట్టెక్కేద్దును. కానీ… ఆ విషయంలోనూ దర్శకుడు భంగపడ్డాడు. కరాచీలో వన్ మ్యాన్ ఆర్మీగా హీరో చేసే సాహస కృత్యాలు మరీ సినిమాటిక్ వ్యవహారాల్లా మారిపోయాయి. `డూప్లికేట్` ఎపిసోడ్‌ని మరింత పకడ్బందీగా తీయాల్సింది. అయితే క్లైమాక్స్ లో మళ్లీ ఆ పాయింట్‌ని వాడుకుని – కాస్త ఓకే అనిపించాడు. ఆ మాత్రం మెరుపు లేకపోతే… ఈ సినిమా మరింత నీరసానికి గురి చేసేది.
గోపీచంద్ యాక్షన్ ఇమేజ్‌కి తగిన కథ ఇది. తనకు టేలర్ మేడ్. కాకపోతే… తనలోని నటుడికీ, హీరోకి పరీక్ష పెట్టే సన్నివేశాలేం తగల్లేదు. కథల ఎంపికలోనే గోపీ జాగ్రత్త పాటించాలి. ఏవో కొన్ని సీన్లు చూసి టెమ్ట్ అయిపోతే… ఎదురు దెబ్బలు తప్పవు. మెహరీన్ ఫేస్‌లో ఎక్స్ప్రెషన్స్ ఏమైపోయాయో అర్థం కాదు. మెహరీన్ కంటే జరీన్ ఖాన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. నాజర్ తనకు అలవాటైన నటనే ప్రదర్శించాడు. సునీల్‌ది మరీ చిన్న పాత్ర. అలీ వెకిలి కామెడీ చేశాడు.
ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. గోపీచంద్ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించింది దీనికేనేమో. అయితే.. ఈ కథలో స్టఫ్ మాత్రం దానికి న్యాయం చేయలేకపోయింది. సాదా సీదా కథని ఎంచుకుని, స్పై థ్రిల్లర్‌గా చూపించాలనుకోవడం తిరు చేసిన తప్పు. చాణక్య అని పేరు పెట్టుకుని, అతి తెలివితేటలతో సన్నివేశాల్ని అల్లుకోవడం మరో తప్పు. అతకని కామెడీ, పాటలు… చాణక్యలో వేగాన్ని హరించాయి. నేపథ్య సంగీతం ఎంత బాగున్నా, కెమెరా వర్క్ ఆకట్టుకున్నా… సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అవన్నీ తేలిపోయాయి.
గోపీచంద్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కథల ఎంపికలో కాస్త జాగ్రత్ అవసరం. ఓ దిమ్మతిరిగే హిట్టు కొట్టి, `నేనూ ఉన్నా` అని నిరూపించుకోపోతే – మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కడం కష్టం. చాణక్య మాత్రం గోపీచంద్‌కి విజయాన్ని, ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించడంలో విఫలమైంది.
ఫినిషింగ్ టచ్: తెలివితేటలు చూపించని చాణక్యుడు
తెలుగు360 రేటింగ్: 2/5