ఒక్క రోజు. అదీ రోజంతా కాదు. కొన్ని గంటల కుండపోత వర్షం. హైదరాబాద్ అతలాకుతలమైంది. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారు రోడ్లపైనే చిక్కుకు పోయారు. వాహనాలు అంగుళం ముందుకు కదలడానికి చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలవడంతో పాదచారులూ నరకయాతన అనుభవించారు.
కుంభవృష్టి కురిసినప్పుడు కష్టాలు తప్పవు. రో్డ్లపై హటాత్తుగా అంత భారీగా నీరు చేరినప్పుడు తెరిపినివ్వడానికి కొంత సమయం పడుతుంది. ఇందులో ఎవరినీ నిందించడానికి లేదు. నిజమే. అయితే డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం హైదరాబాదుకు శాపమైంది. ఎప్పుడు భారీ వర్షం కురిసినా మోకాలి లోతు, లేదా మనిషి మునిగే స్థాయిలో రో్డ్లపై నీరు నిలవడం పరిపాటి.
పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతంలో వర్షం కురిస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో అందరికీ తెలుసు. ద్విచక్ర వాహనాలు, కార్లు అటు వైపు ప్రయాణించే పరిస్థితి ఉండదు. అలాగే అమీర్ పేట, జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ మీదుగా నాగార్జున సర్కిల్, సికింద్రా బాద్ కార్ఖానా, ఇంకా అనేక చోట్ల వర్షం కురిసిన ప్రతిసారీ నీరు నిలుస్తుంది. అంటే, ఏదో సమస్య ఉంది. డ్రయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమో, పైప్ లైన్ సమస్యో ఏదో ఉంటుంది. అదేంటో తెలుసుకునే ఓపిక మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వారికి లేనట్టుంది.
హైదరాబాద్ అనూహ్యంగా కోటి జనాభాకు చేరిన నగరం. నిజాం జమానా నాటి డ్రయినేజి వ్యవస్థనే దిక్కు. కొత్తగా విస్తరించిన సైబరాబాద్ తదితర ప్రాంతాల్లో డ్రయినేజీ వ్యవస్థ నిర్మాణం జరగాల్సి ఉంది. పాత వ్యవస్థలో లోపాలను సరిదిద్దాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడం హైదరాబాదీలకు నరకం చూపిస్తోంది. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ అదే తంతు.
ఎప్పుడో 1909లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ డ్రయినేజీ వ్యవస్థ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. వరదల నుంచి నగరాన్ని కాపాడటానికి పక్కా ప్రణాళిక రచించారు. ఆ ప్రకారమే డ్రయినేజీ వ్యవస్థ, నాలాల నిర్మాణం జరిగింది. వాటిపై కబ్జాలు పెరగడం వల్ల వరద ముప్పు పెరుగుతూనే ఉంది. బంగారు తెలంగాణ సాధిస్తామని, హైదరాబాదును విశ్వ నగరం చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ముందు వరద ముప్పు తప్పించడానికి గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అది కూడా ముఖ్యమే. కనీసం వచ్చే వానాకాలం నాటికైనా డ్రయినేజీ వ్యవస్థను సరిచేస్తారేమో చూద్దాం.