తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత లభించనుంది. సొంతంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ సహకారం తప్పనిసరిగా మారింది. దీంతో ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో రెండు కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులను ఇవ్వనున్నారని.. అదే సమయంలో తెలంగాణ నుంచి ఇద్దరికి బెర్త్ దక్కవచ్చునని తెలుస్తోంది.
ఈ నెల 9న కేంద్రప్రభుత్వం కొలువుదీరనుండగా ఆ తర్వాతే మంత్రివర్గ కూర్పుపై స్పష్టత రానుంది. అయితే , తెలంగాణ నుంచి ఎవరెవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కవచ్చుననేది ఆసక్తికరంగా మారింది. గత కేబినెట్ లో కేంద్రమంత్రిగా కొనసాగిన కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారా..? లేదంటే ఆయన స్థానంలో మరో నేతకు ఛాన్స్ ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి, డీకే అరుణ పేర్లను బీజేపీ పరిశీలించనుందని వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చునని తెలుస్తోంది.
ఇక, బండి సంజయ్ ను కేబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం నేపథ్యంలో బీసీ కోటా నుంచి అర్వింద్ , ఈటల నుంచి బండికి గట్టిపోటీ ఎదురుకానుంది. ఇప్పటికే ఈటల గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని బీజేపీ అగ్రనేతలు సంకేతాలు ఇవ్వడంతో బీసీ కోటాలో ఎవరికీ కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే, అర్వింద్ కు సహాయ మంత్రి పదవి దక్కవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఇలా.. మొత్తానికి ఈసారి సెంట్రల్ సర్కార్ లో తెలుగు రాష్ట్రాలకు చాలా ఏళ్ల తర్వాత మంచి ప్రియార్టి లభించనుండటం ఖాయంగా కనిపిస్తోంది.